కరీంనగర్: తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో ఊపిరితిత్తులు పూ ర్తిగా దెబ్బతిన్న రోగుల ప్రాణా లను కాపాడడంలో ఎక్మో సపోర్ట్‌తోపాటు ఊపిరితిత్తుల మార్పిడి(లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చికిత్స కీలక పాత్ర పోషిస్తోందని సోమాజిగూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చివరి దశ ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ లేదా ఇతర తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యాల కారణంగా ఊపిరితిత్తులు రక్తానికి ఆక్సిజన్ అందించే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు ఎక్మో లైఫ్ సపోర్ట్ విధానాన్ని ఉపయోగిస్తామని వివరించారు. ఈ విధానంలో శరీరం వెలుపల ఉన్న యంత్రం కృత్రిమ ఊపిరితిత్తుల్లా పని చేసి రక్తానికి ఆక్సిజన్ అందించి తిరిగి శరీరంలోకి పంపుతుందని చెప్పారు. ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైన రోగులకు దాత లభించేవరకు ప్రాణాలను నిలబెట్టే బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్ విధానంగా ఎక్మో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అత్యంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్స అని, గుండె–ఊపిరితిత్తుల నిపుణులు, అనస్థీషియా వైద్యులు, ఐసీయూ బృందం సమన్వయంతోనే విజయవంతంగా నిర్వహించగలమన్నారు. డాక్టర్ జీవన్, సుధీర్‌రెడ్డి, హరీశ్‌రెడ్డి, సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లు.. డెయిరీకి జరిమానా
పెద్దపల్లి: రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లు వేయొద్దని సూచించినా.. వినకుండా నిబంధనలు ఉల్లంఘించిన కరీంనగర్ డెయిరీకి రూ.3వేల జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయ సమీపంలోని డెయిరీ ఎదుట రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లు వేయడంతో గమనించిన సిబ్బంది.. జరిమానా విధించారని పేర్కొన్నారు. ఇకనుంచి తరచూ షాపుల ఎదుట తనిఖీలు చేస్తామని, కుళ్లినపండ్లు పారవేసినా జరిమానా తప్పవని ఆయన హెచ్చరించారు.


