● రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నమనేని సుధాకర్‌రావు
కరీంనగర్ అర్బన్: ఎఫ్‌సీఐ మిల్లింగ్ చార్జీల చెల్లింపులో నిబంధనలను బూచీగా చూపి ష్యూరిటీలను ఆందోళనకు గురి చేయడం తగదని రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నమనేని సుధాకర్‌రావు ఆక్షేపించారు. జిల్లాకు రూ.3కోట్ల వరకు చార్జీలు రావాల్సి ఉందని, కేవలం డిఫాల్టర్లకు ష్యూరిటీ సంతకం చేసినందుకు సదరు బిల్లులు ఆపడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. గురువారం స్థానిక రైస్‌మిల్లర్ల సంఘ భవనంలో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఘటనలకు తావులేకుండా 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులు దింపుకున్నాయని, ఇతర జిల్లాల నుంచి మరో 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందన్నారు. 187 రైస్‌మిల్లులుండగా 110 మిల్లులు మనుగడలో ఉన్నాయని, బకాయి ఉండి వందశాతం సీఎంఆర్ చెల్లించిన మిల్లులకూ ధాన్యం కేటాయించారని వివరించారు. యాసంగి సీఎంఆర్‌కు సంబంధించి అధిక ఉష్ణోగ్రతల వల్ల నూక అవుతుందని, రారైస్ చేయడానికి వీలు కాదన్నారు. జిల్లాకు సరిపడా బాయిల్డ్ టార్గెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత బకాయి ఉన్న మిల్లులకు 25శాతం పెనాల్టీ, 12శాతం వడ్డీ మాఫీ చేసి వారికి కూడ అవకాశం కల్పించి అన్ని మిల్లులు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం డైరెక్టర్లు విశ్వనాథ వీరకుమార్, కె.కేశవరెడ్డి, తొడుపునూరి శివప్రసాద్, బోనగిరి శశికిరణ్, వేణు పాల్గొన్నారు.
ఉన్నత ప్రమాణాలతో విద్యనందించాలి
చిగురుమామిడి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన చేయాలని, నాణ్యమైన భోజనం అందించాలని డీఈవో ప్రశాంత్‌రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. మండలంలోని ఇందుర్తి జెడ్పీపాఠశాలను గురువారం తనిఖీ చేశారు. వంట గది, విద్యార్థుల హాజరుశాతం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కుల పంపిణీ, ల్యాబ్‌ను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడా రు. సెల్‌ఫోన్లు, సినిమాలకు దూరంగా ఉండాలన్నారు. వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. ఎంఈవో జయప్రద, ఉపాధ్యాయులు మంజుల, శ్రీదేవి, సరిత, ఓదెలు కుమార్, తిరుపతి, వేణు, సూర్యప్రకాశ్, పవన్‌కుమార్, చారి ఉన్నారు.
హక్కులను కాపాడేందుకే ఏఐటీయూసీ ఉద్యమం
కరీంనగర్‌టౌన్: కార్మికుల హక్కులు, చట్టాలను కాపాడేందుకు ఏఐటీయూసీ ఉద్యమిస్తోందని ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్ చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఏఐటీయూసీ ఆఫీస్ బేరర్స్, అనుబంధ సంఘాల ముఖ్యనేతల సమావేశం పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఏఐటీయూసీ, సీపీఐ రాష్ట్ర నాయకులు రాష్ట్ర మహాసభల కరపత్రం ఆవిష్కరించారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో సెప్టెంబర్ 6,7,8వ తేదీల్లో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఇన్‌చార్జి వీఎస్.బోస్, ఎస్.బాలరాజు, కలవేన శంకర్,, టేకుమల్ల సమ్మయ్య, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


