కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్(బావుపేట) రహదారిపై మళ్లీ నీరు నిలుస్తోంది. రెండు రోజుల పాటు హడావిడి చేసిన అధికారులు చేతులెత్తేశారు. శాశ్వత పరిష్కారానికి డ్రైనేజీ నిర్మాణమొక్కటే మార్గం కాబట్టి, నిధులు లేకపోవడంతో వర్షాకాలంలో రహదారి అధ్వానంగా మారి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. రహదారికిరువైపుల ఉన్న ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నీరు వెళ్లే మార్గం లేక లోతుగా ఉన్న ప్రదేశంలో నిలుస్తున్నాయి. ఓ వైపు వర్షం, మరో వైపు డ్రైనేజీ నీటితో రహదారిపై గోతులు పడుతున్నాయి.
డ్రైనేజీల్లో నిండుకున్న స్లర్రీ, వ్యర్థాలు
రహదారికి ఇరువైపుల నిర్మించిన డ్రైనేజీలో గ్రానైట్ స్లర్రీ(గ్రానైట్ చూర్ణం), వ్యర్థాలు నిండుకున్నాయి. దీంతో చుట్టుపక్కనున్న ఇండ్లలోని మురికి నీరు వెళ్లే మార్గం లేక లోతుగా ఉన్న రహదారిపై వచ్చి చేరుతున్నాయి. వాహనాల రాకపోకలతో గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారుతోంది. డ్రైనేజీల్లో నిండుకున్న స్లర్రీ, వ్యర్ధాలు తొలగిస్తేనే వర్షపు, మురికి నీరు వెళ్లేందుకు మార్గం సుగుమవుతుంది.
నిబంధనలు విరుద్ధంగా అనుమతులు
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి (నాలా కన్వర్షన్) 40 ఫీట్ల రోడ్డు చూపుతూ నిర్మాణాలు చేపట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా కేవలం 20 ఫీట్ల రోడ్డును చూపుతూ గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు నిర్మాణాలు చేపట్టినప్పటికీ అధికారులు మామూలుగా తీసుకుంటుండంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు
బావుపేట తూంకుంట ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపట్టినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోలేదని, గ్రామ పంచాయతీ అనుమతి ఎలా వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రహదారిపై నిలుస్తున్న నీరు ఈ తూంకుంట వైపు వెళ్లాల్సి ఉన్నందున ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలపై దృష్టిసారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
సొంతంగా రూ.3లక్షలు ఖర్చు చేశా
బావుపేట రహదారిపై నిలుస్తు న్న నీటి మళ్లింపుకు ఇప్పటి వరకు సొంతంగా రూ.3 లక్షలు ఖర్చు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. 150 మీటర్ల డ్రైనేజీ నిర్మించాల్సి ఉంది. డ్రైనేజీల్లో పేరుకుపోయిన స్లర్రీ, వ్యర్థాల తొలగింపుతో పాటు శాశ్వాతంగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తాం.
– పెంచాల ఆంజనేయులు, సర్పంచ్, బావుపేట


