కరీంనగర్ కార్పొరేషన్: కుక్కల జనన నియంత్రణ ఆపరేషన్ల ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. బొమ్మకల్ ప్రాంతంలోని నగరపాలక సంస్థ జంతు సంరక్షణ జనన నియంత్రణ కేంద్రాన్ని వెటర్నరీ, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. కేంద్రంలోని ఆపరేషన్ థియేటర్‌తో పాటు పోస్ట్, ఫ్రీ ఆపరేటీవ్ కెనల్స్‌ను పరిశీలించారు. ప్రజల రక్షణ, ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థ ఆద్వర్యంలో కుక్కల జనన నియంత్రణ ఆపరేషన్లను ప్రారంభించామన్నారు. భారత జంతు సంరక్షణ బోర్డు మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరిస్తూ కుక్కలకు బర్థ్ కంట్రోల్ ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. నగరంలోని నివాస ప్రాంతాల్లో కుక్కలను పట్టుకొని, నిబంధనల ప్రకారం బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు, యాంటీ రేబిస్ వాక్సిన్లు వేయాలని అన్నారు. శస్త్రచికిత్స అనంతరం పోస్ట్ ఆపరేటీవ్ కేర్ వార్డులలో ఐదు రోజులు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జనన నియంత్రణ కేంద్రంలో కుక్కల సంరక్షణ కోసం అదనంగా నిర్మించే 66 కెనల్స్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జనన నియంత్రణ కేంద్రానికి సంబంధించిన స్థల వివాదాలు లేకుండా ఉండేందుకు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి హద్దులను త్వరగా గుర్తించాలని సూచించారు. వెటర్నరీ అధికారి దుర్గాప్రసాద్ రెడ్డి, డీసీపీ బషీరొద్దీన్ పాల్గొన్నారు.


