అక్కడ ప్రమాదం.. ఇక్కడ విషాదం | - | Sakshi
Sakshi News home page

అక్కడ ప్రమాదం.. ఇక్కడ విషాదం

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

రామగుండం: హైదరాబాద్‌ సమీపంలోని రాజీవ్‌ రహదారిపై తుర్కపల్లి –మురారిపల్లి మధ్య గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని ఒకేకుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలవడం తీవ్రవిషాదం నింపింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఊశెట్టి గణపతి(సీనియర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు) చిన్నకుమారుడు చంద్రశేఖర్‌ హైదరాబాద్‌లో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య రేఖ. రేఖ చెల్లెలి కుమారుడు లోహిత్‌(3)ను తీసుకుని తమ కారులో బుధవారం కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శనం చేసుకున్నారు. అదేరోజురాత్రి కారులో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో తుర్కపల్లి–మురారిపల్లి గ్రామ సమీపంలోని రాజీవ్‌ రహదారిపై కారు అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ఘటనలో చంద్రశేఖర్‌(40) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య రేఖ(35), చెల్లెలు కుమారుడు లోహిత్‌(3) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా.. కుటుంబసభ్యులు, బంధువులు స్వగ్రామానికి తీసుకొచ్చారు. ముగ్గురి మృతదేహాలను చూసి గ్రామస్తులు కంటతడిపెట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంపై అంతర్గాంతోపాటు సమీప గ్రామాల్లోనూ విషాదం నెలకొంది.

హైదరాబాద్‌ సమీపంలో లారీని ఢీకొన్ని కారు

ఒకేకుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం

మృతులది రామగుండం సమీప అంతర్గాం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement