కరీంనగర్‌కార్పొరేషన్: నగరంలో మొదటి విడత చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. సోమవారం బల్దియా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. నగర వ్యాప్తంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల నుంచి కారణాలు, వివరాలు సేకరించాలని సూచించారు. లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్1, ఎల్2, ఎల్3 కేటగిరి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పారు. నగరపాలక అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్ ఖాధర్ మొహియుద్దీన్, హౌజింగ్ శాఖ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
బల్దియా ఉద్యోగుల డుమ్మా
కరీంనగర్‌కార్పొరేషన్: నగరపాలకసంస్థ కార్యాలయంలో మెజార్టీ అధికారులు, ఉద్యోగుల తీరు ఇష్టారాజ్యంగా మారింది. సమయపాలన లేకుండా విధుల పట్ల అలసత్వం.. లోపించిన జవాబుదారితనంతో తామొచ్చినప్పుడే డ్యూటీ టైం అనే స్థాయికి కొంతమంది చేరారు. చాలా రోజులుగా ఇదే పరిస్థితి ఉండగా, సోమవారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కార్యాలయంలోని పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం మరోసారి బయటపడింది.
తాళం కూడా తీయలేదు
బల్దియా కార్యాలయంలోని పలు విభాగాలను మేయర్ ఆకస్మింగా తనిఖీ చేశారు. ఉదయం 10.20 నుంచి 10.35 గంటల వరకు ఆయా విభాగాల గదులు, క్యాబిన్‌లను పరిశీలించారు. పౌరసేవల కేంద్ర భవనంలోని ఇన్‌వార్డ్, ట్యాప్‌సెక్షన్, బర్త్ అండ్ డెత్, మెప్మా విభాగాలు ఖాళీగా ఉన్నాయి. కొన్ని గదులకు తాళం కూడా తీయలేదు. ఇక టౌన్‌ప్లానింగ్, అకౌంట్స్ విభాగాల్లో ఒక్క ఉద్యోగి కూడా రాకపోవడంతో మేయర్ ఆశ్చర్యపోయారు. చివరకు కళాభారతిలో నిర్వహిస్తున్న ప్రజావాణికి కూడా 10.30 గంటల వరకు ఒక్క పశువైద్యాధికారి దుర్గాప్రసాద్ మినహా మరో అధికారి కనిపించలేదు.
తీరు మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
ఉద్యోగులు, అధికారులు నిర్ణీత సమయానికి విధులకు హాజరుకాకుంటే చర్యలు తప్పవని మేయర్ హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సమయవేళలు పాటించడం ప్రధాన భాగమని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని, ఆలస్యంగా వచ్చే ఉద్యోగులు తమ తీరు మార్చుకోవాలన్నారు. అనవసరంగా, ఆలస్యంగా విధులకు హాజరయ్యే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
శాతవాహనలో జాతీయ సేవా పథకంపై సమీక్ష
కరీంనగర్ సిటీ: ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల సేవలను విస్తరించి సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ ఇనుగాల మనోహర్ అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలో వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ హరిత దళం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి బాధ్యులు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ వ్యర్ధాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవలంబించాల్సిన నాలుగు రంగుల చెత్తబుట్టల విధానం గ్రీన్ బ్లూ రెడ్ బ్లాక్ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి తిరుపతి రెడ్డి, కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ రంగప్రసాద్, కోఆర్డినేటర్ మనోహర్, డిస్టిక్ యూత్ ఆఫీసర్ తిరుపతిరెడ్డి, కంచు తిరుపతి, విజయ్ కుమార్, ప్రదీప్ రాజ్, అనిల్ కుమార్, భాగ్యలక్ష్మి, వై.ప్రసాద్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.


