సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే.. | - | Sakshi
Sakshi News home page

సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే..

Jun 16 2026 1:10 AM | Updated on Jun 16 2026 1:10 AM

సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే..

బ్రోకర్లను నమ్మి నష్టపోవద్దు

డీటీవో తుమ్మల జైపాల్‌రెడ్డి

‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో పలువురి సందేహాల నివృత్తి

తిమ్మాపూర్‌(మానకొండూర్‌): వాహనాల రిజిస్ట్రేషన్‌, లైసెన్సుల జారీ, స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌, ఇతర రవాణా సేవలు అన్నీ త్వరలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయని జిల్లా రవాణా అధికారి తుమ్మల జైపాల్‌రెడ్డి తెలిపారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి స్పందన వచ్చింది. ఉమ్మడి జిల్లా నుంచి పలువురు వాహనదారులు ఫోన్‌ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రవాణా అధికారి ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

నా బైక్‌కు మరొకరికి విక్రయించాను. ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ కావాలంటే ఎన్‌వోసీ అవసరమా?

– సత్యనారాయణ, పెద్దపల్లి

డీటీవో: వాహనం విక్రయించిన తర్వాత దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ యజమాని పేరుకు బదిలీ చేయడం చాలా ఉత్తమం. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినా, అక్రమంగా వినియోగించినా యజమానిగా మీరు ఇబ్బంది పడతారు. ఎన్‌వోసీ అవసరం లేదు. కానీ, సీసీ చేయించాలి. రవాణా కార్యాలయానికి వెళ్లి నామినల్‌ ఫీజు చెల్లించి సీసీ చేస్తే సరిపోతుంది.

లైసెన్స్‌ ఎలా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోవాలి? – శ్రీనివాస్‌, సిరిసిల్ల

డీటీవో: లైసెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోవడం చాలా సులభం. సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దానికోసం ఆధార్‌ చిరునామా చూపించాలి. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో బదిలీ అయిపోతుంది.

స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ గురించి ఎలా తెలుసుకోవచ్చు?

– విజయ్‌కుమార్‌, కరీంనగర్‌

డీటీవో: స్కూల్‌ బస్సులకు యాజమాన్యాలు జూన్‌ 1 లోగా ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి. 80 శాతం బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలకు వచ్చాయి. 20 శాతం రాలేదు. ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డుపైకి వస్తే సీజ్‌ చేస్తాం. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ వివరాలు ఆన్‌లైన్‌లో లేవు. త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సార్‌.. నా లైసెన్సు గడువు మూడేళ్ల క్రితం ముగిసింది. దానిని ఎలా పునరుద్ధరించుకోవాలి?

– కరుణాకర్‌ బావుపేట కరీంనగర్‌

డీటీవో: లైసెన్స్‌ గడువు ముగిసన తర్వాత ఏడాదిలోపు పునరుద్ధరించుకోవాలి. లేదంటే కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. పాత లైసెన్స్‌ను పెట్టి మీసేవలో దరఖాస్తు చేసుకుంటే మళ్లీ డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించి కొత్త లైసెన్స్‌ జారీ చేస్తాం.

రవాణా కార్యాలయంలో బ్రోకర్ల డామినేషన్‌ ఎక్కువగా ఉంది. మీరు చర్యలు తీసుకోవాలి?

– భిక్షపతి, పెర్కపల్లి, సైదాపూర్‌

డీటీవో: కార్యాలయంలో సేవలు పొందేందుకు వచ్చేవారు బ్రోకర్లను ఆశ్రయించొద్దు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని నేరుగా కార్యాలయానికి రావాలి. చాలా మంది తమ పొరపాట్లు దాచేందుకు బ్రోకర్లను ఆశ్రయించి ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement