బక్రీద్‌ బందోబస్తు కట్టుదిట్టం | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ బందోబస్తు కట్టుదిట్టం

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

● జిల్లా సరిహద్దుల్లో ఆరు ప్రత్యేక చెక్‌పోస్టులు ● అర్థరాత్రి తనిఖీలు చేపట్టిన సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌క్రైం: బక్రీద్‌ సందర్భంగా కరీంనగర్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పండగ వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలను అడ్డుకునేందుకు నగర సరిహద్దులు, ప్రధాన రహదారుల వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. సీపీ గౌస్‌ ఆలం గురువారం అర్ధరాత్రి తరువాత మొగ్ధుంపూర్‌ చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న రక్షణ పరికరాలపై ఆరా తీశారు. శనివారం వరకు ప్రతి చెక్‌పోస్టు వద్ద అవసరమైన సౌకర్యాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

జిల్లాలో ఆరు చెక్‌పోస్టులు

జిల్లా పరిధిలోని కరీంనగర్‌ రూరల్‌ మండలం మొగ్దుంపూర్‌, కొత్తపల్లి మండలం చింతకుంట, చొప్పదండి మండలం ఆర్నకొండ, తిమ్మాపూర్‌ మండలం రేణికుంట, హజూరాబాద్‌ మండలం పరకాల ఎక్స్‌రోడ్డు, గంగాధర మండలం తుర్కసినగర్‌ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ చెక్‌పోస్టులో మూడు టార్చ్‌లైట్లు, ఎల్‌ఈడీ బాటన్లు, అత్యవసర విజిల్స్‌ అందుబాటులో ఉండాలని సీపీ స్పష్టం చేశారు. రాత్రివేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది రిఫ్లెక్టర్‌ జాకెట్లు ధరించాలని సూచించారు. చెక్‌పోస్టుల గుండా వెళ్లే ప్రతి వాహనం, వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనుమానాస్పద వాహనాల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక రిజిష్టర్లు నిర్వహించాలని, సమాచార మార్పిడికి ప్రత్యేక కమ్యూనికేషన్‌ బేస్‌సెట్లు ఏర్పాటు చేయాలన్నారు. బక్రీద్‌ సమయంలో అక్రమ రవాణా, నిబంధనల ఉల్లంఘనలు, అనుమానాస్పద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ఈ ప్రత్యేక తనిఖీల ఉద్దేశమని సీపీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement