అయ్యో దేవుడా.. | - | Sakshi
Sakshi News home page

అయ్యో దేవుడా..

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

నాలుగేళ్లలో తల్లిదండ్రుల మృతి

ఒంటరైన కూతుళ్లు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): చేయిపట్టి నడిపించే నాన్న దూరమయ్యాడు. అన్నీ తానై పెంచిన తల్లి కానరాని లోకాలు వెళ్లింది. నాలుగేళ్ల వ్యవధిలో ఆ ఆడబిడ్డలు అనాథలుగా మిగిలారు. మేము ఏం పాపం చేశాం దేవుడా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆలనపాలన చూసుకునే తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలిన ఆడపిల్లల అంతులేని కథ పలువురి హృదయాలను కదిలిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌కు చెందిన పుట్ట రజిత(38) గుండెపోటుతో బుధవారం మృతిచెందింది. రజిత భర్త బాలరాజు నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లు సాయిప్రియ, సాయిప్రసన్న దిక్కులేని పక్షులయ్యారు. నాలుగేళ్ల క్రితం బాలరాజు మృతిచెందినప్పటి నుంచి తల్లి రజిత బీడీలు చుడుతూ పిల్లలను పోషించింది. ఆమె కూడా ఏడాది క్రితం గుండెజబ్బుకు గురైంది. కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారు. రెక్కాడితే కాని డొక్కాడని రజిత బాధను దిగమింగుకుని జబ్బును భరించింది. తాను ఉన్నంతకాలం పిల్ల లను పోషించుకుంది. వ్యాధి ముదరడంతో రజిత ప్రాణాలు కోల్పోయింది. అన్నీ తానై ఉంటుందనుకున్న అమ్మ కూడా మృతిచెందడంతో సాయిప్రియ, సాయిప్రసన్నల రోదనలు మిన్నంటాయి. గురువారం జరిగిన అంత్యక్రియలలో పెద్ద కూతురు సాయిప్రియ తల్లి చితికి కొరివిపెట్టింది. ఒంటరై అనాథలుగా మిగిలిన సాయిప్రియ, సాయిప్రసన్నలను ప్రభుత్వం, మానవతావాదులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement