కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌లో సంస్థాగత సందడి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌లో సంస్థాగత సందడి

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

● దరఖాస్తుల స్వీకరణ షురూ... ● జిల్లా అధ్యక్ష పదవికి 20 ● నగర అధ్యక్ష పదవికి ఐదు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ సంస్థాగత ప్రక్రియలో భాగంగా ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. గురువారం నగరంలోని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో ఎస్సీ సెల్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిశీలకుడు కొరివి అరుణ్‌కుమార్‌ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనుంది.

జిల్లా అధ్యక్ష స్థానానికి 20 దరఖాస్తులు

పీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎస్సీ సెల్‌ నూతన కార్యవర్గాలను నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆశావాహుల నుంచి దరఖాస్తులు సేకరించేందుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిశీలకుడిగా కరీంనగర్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొరివి అరుణ్‌కుమార్‌ను ఇటీవల నియమించారు. ఈ క్రమంలో గురువారం డీసీసీ కార్యాలయంలో కరీంనగర్‌ జిల్లాకు సంబంధించిన పదవులకు ఆశావాహుల నుంచి దర ఖాస్తులు స్వీకరించారు.మొదటి రోజు ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షస్థానానికి 20 దరఖాస్తులు వచ్చాయి. అలాగే నగర అధ్యక్ష స్థానానికి పది మంది దరఖాస్తు చేసుకొన్నారు. అలాగే మండల అధ్యక్ష పదవికి పది దర ఖాస్తులు వచ్చాయి.

కష్టపడ్డ కార్యకర్తలతోనే కమిటీ

కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కమిటీల్లో గుర్తింపు ఉంటుందని ఎస్సీ సెల్‌ ఉమ్మడి జిల్లా పరిశీలకుడు కొరివి అరుణ్‌కుమార్‌ తెలిపారు. పీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కవ్వంపల్లి నేతృత్వంలో వినూత్న తరహాలో కమిటీల ఎంపిక ప్రక్రియను చేపట్టామన్నారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, అర్బన్‌ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ల అనుమతితో డీసీసీ కార్యాలయంలో ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగుస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement