చొప్పదండి: కొనుగోలు కేంద్రాలకు ఇన్‌చార్జీలను నియమించి తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, ఆర్నకొండ కొనుగోలు కేంద్రం, గంగాధర మండలం మధురానగర్ కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌస్ ఆలంతో కలిసి గురువారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లారీలు సమకూర్చాలని అధికారులను ఆమె ఆదేశించారు. మిల్లుల వద్ద అన్‌లోడింగ్ చేయాలని సూచించారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అవసరమైతె ట్రాక్టర్లను వినియోగించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ జాప్యం లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఆర్డీవో మహేశ్వర్, డీఎస్‌వో నర్సింగరావు, డీఎం రజనీకాంత్, తహసీల్దార్ నవీన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.


