గ్రానైట్, మట్టి, ఇసుక, మార్బుల్ నుంచి ప్రభుత్వ ఖాతాలో జమ
అక్రమార్కులకు సింహ స్వప్నంలా ట్రైనీ ఐపీఎస్
మట్టి, గ్రానైట్ ఓవర్‌లోడ్‌పై సోహం సునీల్ దూకుడు
మిగతా అధికారుల పట్టింపేది?
40 రోజులు
కొత్తపల్లి మండలంలోని అక్రమ దందాలపై ట్రైనీ ఐపీఎస్ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సోహం సునీల్ దూకుడు పెంచారు. కొత్తపల్లి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా మార్చి 16న బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అక్రమ దందాలపై విరుచుపడుతున్నారు. 40 రోజుల్లో.. రూ.42,83,542 అపరాధ రుసుం ప్రభుత్వ ఖాతాలో జమ చేయించారు. మారువేషంలో సామాన్యుడిలా..ద్విచక్ర వాహనంపై రహస్యంగా తనిఖీలు చేపడుతూ గ్రానైట్, మట్టి, ఇసుక, మార్బుల్, బెల్టుషాపు వ్యాపారుల పాలిట సింహ స్వప్నంలా తయారయ్యారు. ఓ వైపు స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి సమయం కేటాయిస్తూనే అక్రమార్కులకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఇలాంటి అధికారి ఇలాగే కొనసాగితే అక్రమ దందాలు మూతపడటంతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చే అవకాశముంది.
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్)●:
కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు చేపట్టిన సోహం సునీల్ తనదైన శైలిలో అక్రమ దందాలపై కొరడా ఝళిపించారు. కొత్తపల్లి మండలంలోని అక్రమ దందాలపై దాడులు కొనసాగిస్తుండటంతో అక్రమ కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు గ్రానైట్.. మరోవైపు మట్టి.. ఇంకోవైపు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించారు. శిక్షణ కాలంలో భాగంగా సుమారు 40 రోజుల్లోనే రూ.42,83,542 అపరాధ రుసుంను ప్రభుత్వ ఖాతాలో జమ చేయించి ప్రత్యేకతను చాటారు. ఓవర్ లోడ్, అనుమతి లేకుండా, ఇన్సూరెన్స్ తదితర అనుమతులు లేకుండా నడుస్తున్న 26 గ్రానైట్ వాహనాల నుంచి రూ.38,16,427, ఏడు ఇసుక వాహనాల నుంచి రూ.38,765, మూడు మార్బుల్ వాహనాల నుంచి రూ.2,95,234, 8 మట్టి వాహనాల నుంచి రూ.1,33,116 వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరింది. కేవలం పోలీస్‌శాఖ పరిధిలోని అంశంలోనే ఇంత ఆదాయం వచ్చిందంటే మిగిలిన సంబంధిత శాఖలు ఏంచేస్తున్నాయన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్, బద్ధిపల్లి, ఎలగందుల, శ్రీరాములపల్లి, ఖాజీపూర్, కమాన్‌పూర్, నాగులమల్యాల గ్రామాల్లోని ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు స్థానికుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అనుమతుల్లేకుండా..పన్నులు చెల్లించకుండా..ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ.. ఇష్టమొచ్చినట్లు ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ చూర్ణం (స్లర్రీ) పోస్తూ.. అక్రమ రవాణాకు పాల్పడుతూ.. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక గ్రామస్థాయి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ పైస్థాయి అధికారుల నుంచి స్పందన రాకపోవడం, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు అల్లాడిపోతున్నారు. పల్లెల్లో గ్రానైట్ అఘాయిత్యాలు యథేచ్ఛగా సాగుతున్నా జిల్లా యంత్రాంగం దృష్టి సారించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


