జనగణన పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన పకడ్బందీగా నిర్వహించాలి

May 14 2026 6:39 AM | Updated on May 14 2026 6:39 AM

● జిల్లా సెన్సెస్‌ ఇన్‌చార్జి తిరుపతి ● మండల, డివిజన్‌ స్థాయిలో పర్యవేక్షణ ● జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు

● జిల్లా సెన్సెస్‌ ఇన్‌చార్జి తిరుపతి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: జనగణనను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా సెన్సెస్‌ ఇన్‌చార్జి తిరుపతి సూచించారు. నగరంలోని కాశ్మీర్‌గడ్డ, చైతన్యపురి, రాంనగర్‌ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను బుధవారం ఆయన పరిశీలించారు. హౌస్‌లిస్ట్‌ బ్లాక్‌ బౌండరీలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. నెంబరింగ్‌, డిజిటల్‌ మ్యాపింగ్‌పై ఎన్యుమరేటర్లు, సూపర్‌ వైజర్ల పనితీరు పరిశీలించారు. ప్రతీ ఇంటి సమాచారాన్ని కచ్చితంగా సేకరించాలన్నారు. స్వీయ గణన చేసుకున్న వాళ్లు ఎన్యుమరేటర్లకు ఐడీని చూపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ శ్రీధర్‌, టీపీబీవో ఖాదర్‌ మొహియొద్దిన్‌, ఎన్యుమరేటర్లు, సూపర్‌ వైజర్లు పాల్గొన్నారు.

బాధ్యతలు చేపట్టిన డీఆర్డీవో

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా ఎం.గీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నెల రోజుల క్రితమే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జిల్లాకు బదిలీ అయ్యారు. కానీ.. బాధ్యతలు చేపట్టలేదు. దీంతో గత డీఆర్డీవో శ్రీధర్‌ ఆ పదవీలో కొనసాగారు. తాజాగా గీత బాధ్యతలు స్వీకరించి కలెక్టర్‌ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు.

ధాన్యం రవాణాకు స్పెషల్‌ టీంలు

కరీంనగర్‌ అర్బన్‌: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని ట్యాగ్డ్‌ రైస్‌మిల్లులకు రవాణా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. మండలస్థాయిలో మొబైల్‌ టీంలను ఏర్పాటు చేయగా తహసీల్దార్‌ టీం లీడర్‌గా వ్యవహరిస్తారని వివరించారు. కరీంనగర్‌ రూరల్‌, చొప్పదండి, గంగాధర, రామడుగు, గన్నేరువరం, చిగురుమామిడి, కొత్తపల్లి మండలాల్లో ధాన్యం ఎక్కువగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా ప్రత్యేక టీంలు పనిచేస్తాయని వెల్లడించారు. వీరిపై పర్యవేక్షణకు డివిజన్‌ స్థాయిలో పర్యవేక్షణ అధికారి ఉంటారని, టీంలలో సివిల్‌ సప్లయ్‌, రెవెన్యూ, పోలీస్‌, ట్రాన్స్‌పోర్ట్‌ తదితర శాఖలు ఉంటాయన్నారు.

ఇంటర్‌ ఫలితాల్లో నవోదయ వందశాతం ఉత్తీర్ణత

చొప్పదండి: సీబీఎస్‌ఈ ఇంటర్‌ ఫలితాల్లో చొప్పదండిలోని జవహర్‌ నవోదయ విద్యాలయం విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. విద్యాలయానికి చెందిన హనుమాండ్ల అక్షర 94.4 శాతం మార్కులు సాధించి విద్యాలయంలో మొదటి స్థానంలో నిలిచింది. చెక్కల రాజు 92.6 శాతంతో రెండో స్థానం, దొంత జశ్వంత్‌ 90.2 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రిన్సిపాల్‌ బ్రహ్మానందరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement