కరీంనగర్ సిటీ: సాధారణ డిగ్రీ విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏఈడీపీ కోర్సులు రూపొందించబడ్డాయని కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, విద్యాశాఖ అధికారులకు వర్క్‌షాప్ నిర్వహించారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి ఉన్నత విద్యలో నూతనంగా ప్రవేశపెట్టిన ఎఈడీపీ (అప్రెంటిస్షిప్ ఇన్బిడెడ్ డిగ్రీ ప్రోగ్రాం) కోర్సుల ప్రాముఖ్యతను వివరించారు. సాధారణ డిగ్రీ విద్యతో పాటు నైపుణ్యాభివద్ధి ఎంతో అవసరమన్నారు. ఈ కోర్సుల ద్వారా డిగ్రీ చదువుతున్న సమయంలోనే పరిశ్రమలు, సంస్థలు, సేవా రంగాలలో ప్రాక్టికల్ శిక్షణ పొందే అవకాశముంటుందన్నారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు స్టైఫండ్ లేదా స్కాలర్‌షిప్ లభించడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సర్పంచ్‌లు, కార్పొరేటర్లు గ్రామస్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.


