తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన మూల గంగరాజంగౌడ్ (55) తాటిచెట్టు పైనుంచి పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గంగరాజం సోమవారం ఉదయం గ్రామ శివారులో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడ్డాడు. చేతులు, కాళ్లు, ఛాతిభాగంలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రెండురోజుల క్రితం ఓ వ్యక్తి సినీఫక్కీలో రూ.2 వేల నగదు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మెండు బుచ్చమ్మ ఇల్లు నిర్మించుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మేసీ్త్ర రూ.6 వేలు ఇవ్వమన్నాడని మాయమాటలు చెప్పి రూ.2 వేలు తీసుకుని పరారయ్యాడు. అలాగే అదేరోజు రాత్రి పాలెపు మల్లేశం ఇంటి నిర్మాణ సామగ్రిని ఓ వ్యక్తి ఆటోలో దొంగతనం చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న సీసీకెమెరాల సైరన్ మోగడంతో దొంగ ఆటో తీసుకుని పారిపోయాడు.
ఆస్తి కోసం దత్తపుత్రుడే ప్రాణం తీశాడు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): ఆస్తి కోసం ఓ దత్తపుత్రుడు తల్లిని చంపిన ఘటన సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల(కొమండ్లపల్లి)లో జరిగింది. ఎస్సై చంద్రకుమార్ తెలిపిన వివరాలు.. నీరుకుల్ల(కొమండ్లపల్లి)కు చెందిన ఐలవేని భాగ్యమ్మ(55)–రాజయ్య దంపతులకు సంతానం లేరు. దీంతో భాగ్యమ్మ తన మరిది కుమారుడు సాయిని దత్తత తీసుకొని పెంచింది. నాలుగునెలల క్రితం ఆమె భర్త రాజయ్య చనిపోయాడు. కాగా దత్తపుత్రుడు మద్యానికి బానిసై పని చేయకుండా తిరుగుతుండడంతో తల్లి మందిలించింది. దీనిని మనస్సులో పెట్టుకున్న సాయి ఆమెను చంపితే ఆస్తి తనకే దక్కుతుందని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి తల్లిని హత్య చేయాలనే ఉద్దేశంతో ఆమెకు మద్యం తాగించి అనంతరం గొంతునులిమి చంపేశాడు. భాగ్యమ్మ బందువులు సాయిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి అన్న పిట్టల రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటన స్థలాన్ని సీఐ సుబ్బారెడ్డి పరిశీలించారు.
కొడిమ్యాల: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం వీధి కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు. తిరుమలాపూర్ గ్రామంలో ముగ్గురు పిచ్చికుక్క కాటుకు గురయ్యారు. గాయపడిన వారిలో చిన్నారులు ఉన్నారు. నాచుపల్లిలో ఇద్దరు, పూడూర్‌లో ఒకరు కుక్కకాటుకు గురయ్యారు. బాధితులను మండలంలోని ఫ్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు మృతి


