అదృశ్యమై.. బావిలో శవమై?
మానకొండూర్‌రూరల్: ఊరెళ్తున్నానని అమ్మకు చెప్పి బయలుదేరిన యువకుడు అదృశ్యమయ్యాడు. కొడుకు ఇంటికి రాకపోవడంతో పాటు ఫోన్ పనిచేయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడు తీసుకెళ్లిన కారు ఆనవాళ్లు వ్యవసాయ బావిలో లభించడంతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. నాలుగు విద్యుత్ మోటార్లతో బావిలోని నీటిని తోడేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి చెందిన సంగెం స్వరూప, నాగయ్య దంపతులకు కూతురు, కుమారుడు రాజు సంతానం. మూడేళ్ల క్రితం నాగయ్య ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఈ నేపథ్యంలో రాజు హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈనెల 3న తన సొంత గ్రామం ఊటూర్ వెళ్తున్నాని తల్లితో చెప్పి అద్దె కారులో సెల్ఫ్‌డ్రైవ్‌తో బయలుదేరి అదృశ్యమయ్యాడు. మూడు రోజులైనా ఫోన్ రింగ్ కాకపోవడంతో ఈనెల 5న తల్లి మానకొండూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇదే మండలం వేగురుపల్లి గ్రామంలో ఓ వ్యవసాయ బావి వద్ద రాజు తీసుకెళ్లిన కారు ఆనవాళ్లు లభించడంతో గ్రామస్తులు సోమవారం పోలీసులు సమాచారం ఇచ్చారు. సీఐ సంజీవ్ ఘటనా స్థలానాకి చేరుకుని పరిశీలించారు. తర్వాత ఫైరింజన్, జేసీబీల సాయంతో బావిలోని నీటిని తోడేస్తుండగా కారు డిక్కీ భాగం లభ్యమైంది. రాజు మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. అయితే కారులో రాజు ఒక్కడే ఉన్నాడా.. ఇంకెవరైనా ఉన్నారా.. అనే అనుమానాలు నెలకొన్నాయి. కారు పూర్తి భాగం ఇంకా లభించలేదు. రాత్రి వరకూ బావి నుంచి నీటిని తోడేస్తున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బావి నుంచి నీటిని పూర్తిగా తోడితేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. కాగా, కొడుకు కోసం తల్లి రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.
వ్యవసాయ బావిలో యువకుడు తీసుకెళ్లిన కారు ఆనవాళ్లు
బావిలో పడి ఉంటాడని అనుమానం
నాలుగు మోటార్లతో నీటి తొలగింపు
కరీంనగర్ జిల్లా వేగురుపల్లిలో ఘటన
అదృశ్యమై.. బావిలో శవమై?


