ఆర్మేనియాలో బోయినపల్లి యువకుడి మృతి
బోయినపల్లి(చొప్పదండి): బతుకుదెరువుకు యూరప్ లోని ఆర్మేనియా దేశానికి వెళ్లిన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన మేకల ప్రవీణ్(33) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. బోయినపల్లికి చెందిన మేకల సత్తవ్వ–గంగారాం దంపతుల కుమారుడు ప్రవీణ్ 9 నెలల క్రితం రూ.10 లక్షల వరకు అప్పు చేసి ఆర్మేనియా వెళ్లాడు. అక్కడ కారు నడుపుతూ ఉపాధి పొందేవాడు. గత శుక్రవారం రోడ్డు పక్కన ఉండగా ఓ వాహనం వచ్చి ఢీకొట్టడంతో ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అక్కడి స్నేహితులు కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి తెలపడంతో వారు బోరున విలపిస్తున్నారు. ప్రవీణ్‌కు భార్య కవిత, కూతురు శ్రావణి(14), కుమారులు సంజయ్(10), అభినయ్(5)ఉన్నారు.


