యువతా.. మేలుకో
బోయినపల్లి (చొప్పదండి): కాలంతో పోటీ పడాల్సిన యువకులు.. వ్యసనాలకు బానిసలై జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) యుగంలో కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలతో యువత ఎప్పుడూ ముందుండాలి. ఉడుకు రక్తంతో చైతన్యజ్యోతుల్లా వెలిగే యువకులు సేవేమార్గంగా మంచి ఆలోచనలతో సమాజానికి మార్గనిర్ధేశకులుగా నిలవాలి. యువజన చైతన్యమే లక్ష్యంగా.. యువత భాగసామ్యాన్ని దేశాభివృద్ధికి బాటలు వేసేలా ప్రతీ సంవత్సరం జనవరి 12న యువజన స్ఫూర్తిదాత స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆయన జయంతిని ప్రభుత్వం నేషనల్ యూత్ డేగా ప్రకటించింది.
తగ్గాలి నేరాల్లో పాత్ర
సమాజంలో జరిగే నేరాల్లో యువత పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. చైన్‌స్నాచింగ్‌లు.. ర్యాష్‌డ్రైవింగ్.. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, పేకాట వ్యసనాలతో యువత పెడదారిన పడుతున్నారు. వివేకానంద జయంతి సందర్భంగా పెడదారిలో ఉన్న యువత నేరాల వైపు నుంచి మంచి మార్గం వైపు నడవాలి.
డ్రగ్స్, మద్యం మత్తులో..
డ్రగ్స్, మద్యానికి బానిసై యువత తమ విలువైన భవిష్యత్తును వదిలి మత్తులో జోగుతున్నారు. నలుగురు యువకులు కలిస్తే మందు.. చిందే ఫ్యాషన్‌గా మారింది.
ర్యాష్ డ్రైవింగ్‌కు నో..
రోడ్డు ప్రమాదాల్లో యువకులు మృత్యువాత పడుతుండడం విషాదం. యువకుల మితిమీరిన వేగం.. అజాగ్రత్తలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ మోజులో వాహనాలు అతివేగంగా నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎదిగిన కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు.. విగత జీవులను చూసి రోఽధిస్తున్నారు. బైక్ నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్.. హెల్మెట్ ధరించాలి.
సమాజసేవతో ఉత్తములుగా..
సిటీ కల్చర్‌లో అపార్ట్‌మెంట్ల సంస్కృతి వచ్చాక ఎవరికి వారే అన్న ధోరణి పెరిగింది. ఏళ్ల తరబడి పక్కకే ఉన్న పరిచయాలు, పేర్లు తెలియని పరిస్థితి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. బాధలో ఉన్న వారికి బాసటగా నిలిచి సాయం చేయలి.
ఆధ్యాత్మికతతో క్రమశిక్షణ
యువత ఆధ్యాత్మికత వైపు చూస్తే క్రమశిక్షణ కలుగుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. ఆధ్యాత్మికత మనిషిలో దాగి ఉన్న నిగూఢమైన శక్తిని బయటకు తెస్తుంది.
మహిళలకు గౌరవం
ప్రేమ పేరుతో అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేయడం.. అల్లరి పనులు చేయడంతో కొంతమంది యువతకు చెడు పేరు వస్తోంది. కార్యేశుదాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేశు మాత.. శయనేషు రంభ ఈ నానుడి మహిళల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.
లక్ష్యసాధనకు గురిపెట్టాలి
నీలో ఉన్న ప్రత్యేకతను పది మందికి తెలియజేయాలనే తపన లక్ష్యం వైపు పయనింపజేస్తుంది. లక్ష్యం లేని జీవనం కొనసాగించడం అర్థరహితం. యువకులు సమాజంలో గుర్తింపు పొందాలంటే ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి. లక్ష్యసాధనకు కఠోర శ్రమ చేయాల్సిందే. ఉదయాన్నే లేవడం, వ్యాయామం చేయడం వంటివి దినచర్యలో భాగం కావాలి.
నవ సమాజ నిర్ధేశకులు మీరే..
డ్రగ్స్ మత్తులో చిక్కుకోవద్దు
మంచి ఆలోచనలతో సమాజసేవ
నేడు స్వామి వివేకానంద జయంతి
వివేకానంద స్ఫూర్తితో..
సిరిసిల్లటౌన్: ‘పడిపోవడం కాదు...లేచి నిలబడలేకపోవడమే ఓటమి’ అన్న స్వామీజీ సూక్తులకు ఆకర్షితుడైన సిరిసిల్లకు చెందిన యువకుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కొత్వాల సాయిరాం వృత్తి రీత్యా క్షురకుడు. చిన్నప్పటి నుంచి స్వామిజీ కథలను ప్రభావితుడయ్యాడు. కులవృత్తితో జీవనోపాధి పొందుతున్న సాయిరాం సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిన వివేకానందుడి పుస్తకాలు సేకరిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం, వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ అకాడమీ నుంచి ప్రచురితమయ్యే పుస్తకాలను జీవిత చందాదారుడిగా చేరాడు. ఇప్పటి వరకు 400 పుస్తకాలను సేకరించాడు.
యువతా.. మేలుకో


