రోడ్డుప్రమాదంలో దెబ్బతిన్న ఆటో
రామడుగు: మండలంలోని వెదిర గ్రామశివారులో కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆటో ధ్వంసమైంది. కరీంనగర్ నుంచి వస్తున్న ఆటోను జగిత్యాల నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో ఇరువైపులా వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై పడిపోయిన ఆటోను గ్రామస్తులు, పోలీసులు పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
కాలువలో ఇసుక లారీ బోల్తా
వీణవంక: మండలంలోని రెడ్డిపల్లి శివారు అచ్చంపల్లి వద్ద ఎస్సారెస్పీ కెనాల్‌లో ప్రమాదవశాత్తు ఇసుక లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ త్రుటిలో బయటపడ్డాడు. కొండపాక ఇసుక క్వారీ నుంచి లారీలో ఇసక లోడ్ చేసుకున్న డ్రైవర్ చల్లూరు మీదుగా కరీంనగర్‌కు వెళ్తున్నాడు. అచ్చంపల్లి కెనాల్ వద్దకు రాగానే ఫోన్ రావడంతో రివర్స్ తీశాడు. అదుపు తప్పిన లారీ కెనాల్‌లో పడిపోయింది. అప్రమత్తుమైన డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డ్రైవర్ మద్యం మత్తులోనే సంఘటన జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
కంటైనర్ బోల్తా: ఒకరి దుర్మరణం
శంకరపట్నం: మండలంలోని తాడికల్ శివారులో ఆదివారం కంటైనర్ బోల్తాపడి సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన రాణవేని హన్మయ్య (64) ఆదివారం సాయంత్రం పొలం వద్దకు సైకిల్‌పై వెళ్లాడు. పొలం పనులు ముగించుకుని సైకిల్‌పై తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని అండర్‌పాస్ నుంచి వస్తున్న కంటైనర్ అదుపు తప్పి హన్మయ్యపై బోల్తాపడింది. సమీపంలోని రైతులు, వాహనదారులు జాకీలతో కంటైనర్‌ను కొంతమేర పైకి లేపి ఇరుక్కుపోయిన హన్మయ్యను బయటకు తీసి కారులో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న కేశవపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
రోడ్డుప్రమాదంలో దెబ్బతిన్న ఆటో
రోడ్డుప్రమాదంలో దెబ్బతిన్న ఆటో


