మానేరు బ్రిడ్జిపై కారు దగ్ధం
కరీంనగర్‌క్రైం: అల్గునూర్ నుంచి కరీంనగర్ వెళ్లే మానేరు బ్రిడ్జిపై కారు దగ్ధమైంది. ఫైర్ అధికారులు తెలిపిన వివరాలు.. శనివారం సాయంత్రం మంచిర్యాలకు చెందిన మాడ శ్రీరాంరెడ్డి కారులో తన కుటుంబసభ్యులతో హైదరాబాద్ నుంచి మంచిర్యాల వెళ్లే క్రమంలో అల్గునూర్ బ్రిడ్జి వద్దకు రాగానే రేడియేటర్ వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శ్రీరాంరెడ్డి అప్రమత్తమై వెంటనే భార్య, ఇద్దరు పిల్లలను కారు నుంచి కిందికి దించారు. మంటలు పెద్దఎత్తున చెలరేగి కారు కాలిపోతుండగా స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం అందించడంతో వారు మంటలు ఆర్పారు. ఇందులో ఎవరికి ప్రమాదం జరగలేదని డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనతో బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వచ్చి క్లియర్ చేశారు.


