రిజర్వేషన్లు ఎట్లనో!
కరీంనగర్
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
కరీంనగర్ కార్పొరేషన్:
మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల తుది జాబితా ఈ నెల 12వ తేదీన ప్రకటించనుండగా, తరువాత రిజర్వేషన్ల ఖరారుపై యంత్రాంగం సమాయత్తం కానుంది. రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఇప్పటివరకు మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో, ఉత్కంఠ పెరిగింది.
ఇంతకీ.. ఏ ప్రాతిపదికన?
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే డివిజన్లవారీగా ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించింది. అభ్యంతరాల ఆధారంగా జాబితా సవరణ కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీన డివిజన్లవారీగా ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు. 13న పోలింగ్ బూత్‌ల డ్రాఫ్ట్ జాబితా ప్రకటించి, అభ్యంతరాల అనంతరం 16వ తేదీన పోలింగ్ బూత్‌లవారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను డివిజన్ల ప్రకారం ప్రచురించనున్నారు. ఓటర్ల జాబితా దాదాపు కొలిక్కి వచ్చిన సందర్భంలో రిజర్వేషన్లపై చర్చ మొదలైంది. మేయర్, చైర్మన్ పదవులకు రాష్ట్రస్థాయిలో, డివిజన్లు, వార్డులకు మున్సిపాలిటీలవారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రిజర్వేషన్ నిర్ణయించేందుకు ఏ ప్రాతిపదికను అనుసరిస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు రిజర్వేషన్లకు మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో, ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం, బీసీ ఓటర్ల వారిగా, మహిళ డ్రా ద్వారా రిజర్వేషన్‌లు ఖరారు చేశారు. ఇప్పుడు రొటేషన్ పాటిస్తారా, గ్రామాలు, మున్సిపాలిటీల విలీనంతో డివిజన్ల పునర్విభజన జరిగిన కారణంగా, రొటేషన్ లేకుండా రిజర్వేషన్లు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లకు రొటేషన్ పద్ధతి పాటించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో రొటేషన్ ఉంటుందా, మహిళలకు డ్రా పద్దతా, ఓట్ల సంఖ్య ఆధారంగానా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రిజర్వేషన్ సీట్లు పెరిగేనా?
నగరపాలకసంస్థకు రిజర్వేషన్ల మార్గదర్శకాలు ఎలా ఉన్నా, సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో గతంలో 60 డివిజన్లు ఉండగా, విలీనం, పునర్విభజన అనంతరం ఆ సంఖ్య 66కు పెరగడం తెలిసిందే. 60 డివిజన్లలో 23 బీసీ, 6 ఎస్సీ, 1 ఎస్టీ రిజర్వేషన్‌కు కేటాయించగా, ఈ సారి 66 డి విజన్లకు గాను 24 బీసీ, 7 ఎస్సీ, 2 ఎస్టీ(ఇందులో సగం మహిళలు) అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. 2020లో మేయర్ స్థానం అన్‌రిజర్వ్‌డ్ కాగా, ఈ సారి అయ్యే రిజర్వేషన్‌పై ఆయా పార్టీల నేతలు ఆసక్తి కనపరుస్తున్నారు. మార్గదర్శకాలు విడుదలైన తరువాత రిజర్వేషన్‌ల సంఖ్య, ఖరారుపై స్పష్టత రానుంది. ఓటర్ల తుది జాబితా తరువాత రిజర్వేషన్లపై కసరత్తు మొదలయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా రిజర్వేషన్‌ల ఖరారుపై తమ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉండడంతో, అందరి చూపు రిజర్వేషన్‌ల ప్రక్రియపైనే ఉంది.
2020లో కరీంనగర్
నగరపాలకసంస్థ రిజర్వేషన్లు ఇలా
ఎస్టీ 01
ఎస్సీ 03
ఎస్సీ(మహిళ) 03
బీసీ 12
బీసీ (మహిళ) 11
జనరల్ (అన్‌రిజర్వ్‌డ్) 14
జనరల్ (మహిళ) 16
మొత్తం 60


