అంజన్న చెంత.. అవస్థల చింత
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు అంజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తారు. భక్తులకు అనుగుణంగా వసతులు లేకపోవడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. స్వామివారి ఉచిత అన్నదానం కోసం వందలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. భక్తుల నుంచి విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసిన అధికారులు.. భక్తులందరికీ అన్నదానం అందించేలా చర్యలు మాత్రం చేపట్టడం లేదు.
అస్తవ్యస్తంగా మెట్లదారి..
కాలినడకన వెళ్లి స్వామివారికి మొక్కులు అప్పగించాలని వేలాది మంది భక్తులు భావిస్తుంటారు. అయితే మెట్లదారి మీదుగా నడిచివెళ్లాలంటే కష్టతరంగా మారింది. ఆ దారిని పట్టించుకోకపోవడంతో ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగాయి. చెత్తాచెదారంతో నిండిపోయింది. దీనికితోడు దుర్గంధం వెదజల్లుతోంది.
ఏటా పెరుగుతున్న భక్తులు
కొండగట్టు అంజన్న దర్శనానికి మాల ధరించి వచ్చే దీక్షాపరులు ఏటా పెరుగుతున్నారు. హనుమాన్ చిన్న, పెద్ద జయంతి ఉత్సవాల్లో లక్షలాది మంది స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. ఆ సమయంలో మాత్రమే మెట్లదారి వెంట వెలుగులు ఏర్పాటు చేస్తున్న అధికారులు అనంతరం పట్టించుకోవడం లేదు.
పార్కింగ్ తిప్పలు..ట్రాఫిక్ జామ్
దూరప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులు పార్కింగ్ స్థలం కొరతతో ఇబ్బంది పడుతున్నారు. పార్కింగ్ స్థలంలో భక్తుల కోసం గతంలో షెడ్డు నిర్మించడంతో స్థలం కుచించుకుపోయింది. ఘాట్‌రోడ్డు వెంట వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాలు ఆలయం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో వృద్ధులు, చి న్నారులు ఆలయం వరకు వెళ్లలేకపోతున్నారు. ప్ర తి మంగళవారం, శనివారాల్లో వైజంక్షన్ వద్ద తీవ్ర టాఫిక్ జామ్ ఏర్పడుతోంది. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి.
నిలిచిన ఎత్తిపోతల పథకం..
ఆలయంలో నీటి సమస్య పరిష్కారానికి వరదకాలువ నుంచి సంతలొద్దికి నీటిని పంపింగ్ చేసి.. అక్కడి నుంచి కొండపైకి తరలించే పథకం మధ్యలో నిలిచిపోయింది. గత ప్రభుత్వ పాలనలో ప్రారంభించిన ఎత్తిపోతల పథకం రెండున్నరేళ్లు గడుస్తున్నా నేటికి పూర్తికావడం లేదు. ఫలితంగా మిషన్ భగీరథ నీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
వంద మందికే అన్నదానం
ఆలయ ఆధ్వర్యంలో కొండగట్టుకు వచ్చే భక్తులకు నిత్యం 100మంది భక్తులకు మాత్రమే అన్నదానం అందుతోంది. మంగళ, శనివారాల్లో మాత్రం 200 మందికి అందిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. అన్నదానాల సంఖ్య పెంచకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వెనుదిరుగుతున్నారు. రోజూ 200 మందికి, మంగళ, శనివారాల్లో 400మందికి అన్నదానం అందించేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
అస్తవ్యస్తంగా మెట్లదారి.. వాహనాల పార్కింగ్
మరుగున పడిన మాస్టర్ ప్లాన్
నిలిచిన ఎత్తిపోతల పథకం
భక్తులను వేధిస్తున్న గదుల కొరత
అంజన్న చెంత.. అవస్థల చింత


