రీఫిల్లింగ్‌కు అడ్డేది?
కరీంనగర్ అర్బన్: జిల్లాలో మినీ గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనలు పట్టని హోంనీడ్స్ దుకాణదారులు మినీ సిలిండర్లలో గ్యాస్ నింపి సొమ్ము చేసుకుంటున్నారు. రాయితీ, వాణిజ్య సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేసి ఈ దందా సాగిస్తున్నారు. నిఘా పెట్టి నియంత్రించాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతా బహిరంగమే
నగరంలోని పలు హోంనీడ్స్ దుకాణాలు అక్రమ గ్యాస్ సిలిండర్ల దందాకు అడ్డాగా మారాయి. హైదరాబాద్ నుంచి చిన్న సిలిండర్లు కొనుగోలు చేసి తెచ్చి వ్యాపారం చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో మినీ సిలిండర్లు విక్రయిస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. రూ.924 ఉన్న రాయితీ గ్యాస్‌ను ఏజెన్సీ నిర్వాహకులు, డెలివరీ బాయ్స్ నుంచి రూ.1100కి కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు 3 లేదా 4 సిలిండర్లలో నింపుతూ దండుకుంటున్నారు.
ఫోన్ చేస్తే చాలు.. రాయితీ మీ ఇంటికే
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో కార్లకు గ్యాస్ వినియో గం పెరుగుతోంది. ఫోన్ చేస్తే చాలు రాయితీ గ్యాస్‌ను వక్రమార్గంలో అందజేస్తున్నారు. వీరికి మధ్య దళారులుగా మినీ సిలిండర్లు విక్రయించేవారు వ్యవహరిస్తున్నారు. కారులోకి గ్యాస్ నింపాలంటే చాలు సదరు వ్యక్తులకు ఫోన్ చేస్తే వాహనంలో ఎక్కిస్తున్నారు. సదరు సేవలకు రూ.100 వసూలు చేస్తున్నారు. రీఫిల్లింగ్ చేయడం చట్ట రీత్యా నేరమని, ఎవరైనా రీఫిల్లింగ్ చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల అధికారి నర్సింగరావు వివరించారు.
ఒక్క దుకాణమేనా?
వంటగ్యాస్ వ్యాపారుల పంట పండిస్తుంటే పౌరసరఫరాల అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 8న సాక్షిలో ‘యథేచ్ఛగా గ్యాస్ దందా’ శీర్షికన కథనం ప్రచురించింది. పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టగా గాంధీ రోడ్డులోని గ్యాస్ రీపెరింగ్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టి కేవలం 13 సిలిండర్లను పట్టుకుని మమ అనిపించింది. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పద్మనగర్ వరకు, గీతాభవన్ నుంచి రేకుర్తి వరకు, బస్టాండ్ నుంచి పెద్దపల్లి రోడ్డు వరకు తనిఖీలు చేస్తే అడుగడుగునా కుప్పలుగా వంట గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యే అవకాశాలున్నా తదనుగుణంగా చర్యల్లేకపోవడం సివిల్ సప్లయ్ నిబద్ధతకు తార్కాణం.
శనివారం నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో ఆర్‌కే గ్యాస్ సర్వీసింగ్ సెంటర్‌లో సివిల్ సప్లయ్ డీటీ సురేందర్ తనిఖీలు చేపట్టారు. కుప్పలు తెప్పలుగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వెలుగుచూశాయి. 13 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సమీప గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. సదరు సబ్సిడీ గ్యాస్‌ను మినీ సిలిండర్లలో
నింపుతూ సొమ్ము చేసుకుంటున్నారు.


