కాంగ్రెస్‌తోనే దళితులకు ఆత్మగౌరవం
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీతోనే దళితులకు పదవులు, ఆత్మగౌరవం సాధ్యమని పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా నియామకమైన అనంతరం శనివారం తొలిసారిగా జిల్లాకు వచ్చిన కవ్వంపల్లికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. నగరంలోని ఎన్‌టీఆర్ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కోర్టు చౌరస్తాలో ఏర్పాటుచేసిన సభలో కవ్వంపల్లి మాట్లాడారు. దళితులకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పదవులు ఇచ్చింది, ఆత్మగౌరవం ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దళితుడైన రాజయ్యకు డిప్యూటీ సీఎం ఇచ్చినట్లే ఇచ్చి తొలగించారని విమర్శించారు. కొప్పుల ఈశ్వర్‌ను తన పక్కన కూడా కూర్చోనివ్వకుండా కేసీఆర్ అవమానించాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక నలుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. దళితులకు సేవ చేసేందుకు తనకు ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ అనే బాధ్యతను అప్పగించారన్నారు. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి దళితులు వెన్నెముక అన్నారు. కవ్వంపల్లికి మంత్రి పదవి వెంట్రుక వాసిలో తప్పిపోయిందని, ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ పదవి వచ్చిందన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలైతే సత్యనారాయణ సతీమణి కవ్వంపల్లి అనురాధ ఎమ్మెల్యే అవుతారన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ కమిటీ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, ఆర్‌టీఏ సభ్యుడు పడాల రాహుల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణగౌడ్, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


