నకిలీ ఉద్యోగాల ముఠా గుట్టురట్టు
ఆదిలాబాద్‌టౌన్: ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆదిలాబాద్ వన్‌టౌన్‌లో కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ముఠా వివరాలను శనివారం ఆదిలాబాద్‌లోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. నిందితుల్లో వరంగల్ జిల్లా గీరమాజిపేటకు చెందిన అనంత ఈ–సొల్యూషన్ సీఈవో జిట్టబోయిన మధుకిరణ్, హన్మకొండలోని జాఫర్‌గడ్‌కు చెందిన మాదాసి సుధాకర్, గోదావరిఖనిలోని కళ్యాణ్‌నగర్‌కు చెందిన నమ్మని సతీశ్‌లను అరెస్టు చేయగా, హైదరాబాద్‌కు చెందిన సుజాత ఠాకూర్, లావణ్య పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరు 2013లో అనంత ఈ–సొల్యూషన్ పేరిట కంపెనీ స్థాపించి ఔట్‌సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించారని తెలిపారు. విద్యాంజలి 2.0 పథకం ద్వారా డబ్బులు దుర్వినియోగం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సీఎస్‌ఆర్ నిధులు కాజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఆయా జిల్లాల్లో ఏజెంట్లను నియమించి పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 240 మంది నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. మూడు నెలలపాటు వేతనం అందించిన తర్వాత వేతనం రాకపోవడంతో బాధితులు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారని తెలిపారు. వారికి సహకరించిన ఏజెంట్లను ఇదివరకే జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన వన్‌టౌన్ సీఐ సునిల్‌కుమార్, ఐటీ కోర్ ఆర్‌ఎస్సై గోపీకృష్ణలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, ఎస్సైలు గోపికృష్ణ, నాగనాథ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


