అంతర్రాష్ట్ర సైబర్ నిందితుడి రిమాండ్
వేములవాడరూరల్: అంతర్రాష్ట్ర సైబర్ ప్రధాన నిందితుడు లక్కీకుమార్ అలియాస్ సదానంద్‌కుమార్‌ను శనివారం అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రుత్విక్‌సాయి పేర్కొన్నారు. వేములవాడరూరల్ సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బిహార్‌లోని బహుదూర్పూర్ గ్రామానికి చెందిన లక్కీకుమార్ హైదరాబాద్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించాడు. సరిగా నడవకపోవడంతో బిహార్ వెళ్లిపోయాడు. అనంతరం ఆన్‌లైన్ ద్వారా లోన్ల పేరుతో ప్రజలను మోసం చేయాలని పథకం రూపొందించాడు. అనిల్‌నాయక్, బోడ రజిత, భరత్‌రాజ్‌తో కలిసి ఫేస్‌బుక్‌లో ఇండియాబుల్స్ ధని ఫైనాన్స్ పేరుతో నకిలీ పేజీ సృష్టించి, తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇప్పిస్తామని ప్రచారం చేశాడు. ఆ పేజీని సందర్శించిన వారి ఫోన్ నంబర్లకు ఫోన్‌చేసి నమ్మించి పత్రాలు, చార్జీల పేరుతో డబ్బు వసూలు చేసి లోన్ మంజూరు చేయకుండా మోసం చేశాడు. ఇందులో బాధితుడైన వేములవాడరూరల్ మండలం ఫాజుల్‌నగర్‌కు చెందిన పోగుల మల్లేశంకు ఫోన్ చేసి రూ.5 లక్షల లోన్ వస్తుందని తెలిపి, ప్రాసెసింగ్ ఫీజు రూ.1,18,400 వసూలు చేశాడు. బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సైబర్‌క్రైంలో ఫిర్యాదు చేయగా, లక్కీకుమార్, అనిల్‌నాయక్, బోడ రజిత, భరత్‌రాజ్‌పై కేసు నమోదు చేశారు. వేములవాడరూరల్ సీఐ ఆధ్వర్యంలో సైబర్ ఆర్‌ఎస్సై జునైద్, ఎస్సై వెంకట్రాజం, కానిస్టేబుల్ కిట్టు, చందు టీమ్ హరియాణాలో లక్కీకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై దేశవ్యాప్తంగా ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో 30 ఫిర్యాదులు ఉన్నాయని ఏఎస్పీ తెలిపారు.


