కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జీగా ‘వెలిచాల’
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీగా వెలిచాల రాజేందర్‌రావు నియామకం అయ్యారు. నగరపాలకసంస్థ ఎన్నికలకు ముందు రాజేందర్‌రావుకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశంతో శనివారం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చాలా రోజుల తరువాత కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పోస్టు భర్తీ అయింది. 2023లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్ ఓటమి అనంతరం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీగా కొనసాగారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పురుమల్లను దాదాపు ఏడాది క్రితం కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి పోస్టు ఖాళీగా ఉంది. 2024లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన వెలిచాల రాజేందర్‌రావు, అనంతరం కరీంనగర్‌లో క్రియాశీలకంగా మారారు. ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్ష, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ పదవుల్లో ఏదో ఒకటి వస్తుందని ప్రచారం జరగగా, మేడిపల్లి సత్యంకు డీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ పదవి రాజేందర్‌రావును వరించింది.
కార్పొరేషన్ కై వసం చేసుకుంటాం
నగరపాలకసంస్థ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి మేయర్ పీఠాన్ని కై వసం చేసుకొంటామని రాజేందర్‌రావు అన్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని తెలిపారు.


