సిటీలో ఓట్ల సందడి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఓట్ల సందడి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించి న ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాల సవరణ ఓ వైపు సాగుతుండగా, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ మరోవైపు కొనసాగుతోంది. దీంతో తమ ఓట్లు ఎక్కడున్నాయి.. అసలు ఉన్నాయా లేవా అని నగరవాసులు వెతుకుతుండడంతో, డివిజన్లలో ఓట్ల హడావుడి మొదలైంది.
కొనసాగుతున్న సవరణ
మున్సిపల్ ఎన్నికలకు నగరపాలకసంస్థ అధికారులు ప్రకటిన ముసాయిదాపై గతంలో ఎన్నడూలేని విధంగా అభ్యంతరాలు వచ్చాయి. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్‌లో రావడం, ఇంటి నంబర్లు లేని ఓటర్ల పేర్లు కూడా ఉండడంతో నగరవ్యాప్తంగా 249 అభ్యంతరాలు అందాయి. వీటిని సరిచేసేందుకు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం, వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించా రు. అభ్యంతరాల ఆధారంగా ఆయా ఓట్లు ఏ ఇంటినంబర్‌పై ఉన్నాయి, ఆ ఇంటి నంబర్ ఏ డివిజన్‌లో ఉందో పరిశీలిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన నగరంలోని 66 డివిజన్లవారీగా ఓటర్ల తుది జాబితాను ప్రచురించాల్సి ఉండడంతో, ఆ లోగా అభ్యంతరాలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్
దేశవ్యాప్తంగా బోగస్ ఓటర్ల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రి విజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా నగరంలో మ్యాపింగ్ చేపడుతున్నారు. ఒక్కో డివిజన్‌లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. దీంతో ఆయా డివిజన్‌లలో ఓటర్లు తమ వద్ద ఉన్న ఆధారాలతో వచ్చి బీఎల్‌వోలతో నిర్ధారించుకుంటున్నారు. ఓట్ల నిర్ధారణ అనంతరం యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.


