చేనేతకు చేయూత అందిస్తాం
విద్యానగర్(కరీంనగర్): కేంద్ర ప్రభుత్వం ద్వారా చేనేతకు చేయూత అందిస్తామని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆన్నారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాభారతి చేనేత హస్తకళ మేళా, చేనేత వస్త్ర ప్రద ర్శన, అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతిలో అంతర్భాగమైన చేనేత, హస్తకళలు శ్రమైక్య జీవనసౌందర్యానికి ప్రతీకలన్నారు, చేనేతను ప్రజలందరూ ఆదరించాలన్నారు. పోచంపల్లి, మంగళగిరి, గద్వాల్ తదితర ప్రాంతాల్లోని చేనేత వస్త్రాలు విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందాయన్నారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, జంజారా ఉత్పత్తులు, కళాత్మక ఆభరణాలు ఈ ప్రదర్శనలో ప్రజలకు అందబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాభారతి అధ్యక్షులు, నిర్వాహకులు జెల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


