గెలిపిస్తే.. అభివృద్ధి చూపిస్తా..
జమ్మికుంట(హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయా పైసా లేదని, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలటీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో సింథటిక్ స్టేడియానికి రూ.6.5కోట్ల నిధులు మంజూరైన నేపథ్యంలో బుధవారం కాలేజీ స్థలాన్ని పరిశీలించారు. సింథటిక్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మాదిరిగా మోదీ ప్రభుత్వం కాగితాలకు పరిమితం కాదని, టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఇటీవల జమ్మికుంట, హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.3కోట్ల విలువైన మెడికల్ పరికరాలను అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఆర్డీవో రమేశ్‌బాబు, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, నాయకుడు ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


