యథేచ్ఛగా గ్యాస్ దందా
తనిఖీలు చేపడతాం
● హోటళ్లలో కుప్పలు తెప్పలుగా రాయితీ సిలిండర్లు
● తనిఖీల్లేవ్.. అమ్యామ్యాలే ● పట్టించుకోని అధికారులు
డీమార్ట్ పక్కన గల శ్రీలక్ష్మి ఫుడ్ కోర్టు ఇది. ఇక్కడ సబ్సిడీ గ్యాస్ యథేచ్చగా వినియోగిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెప్పడమే తప్ప నామమాత్రమే.
అంబేడ్కర్ స్టేడియం సమీపంలోని పరిపూర్ణ టిఫిన్ సెంటర్‌లో ఇష్టారాజ్యంగా సబ్సిడీ గ్యాస్ వినియోగిస్తున్నారు. నిత్యం ఇదే ప్రక్రియ కాగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ కలెక్టర్, అదనపు కలెక్టర్లుండే నగరంలో అడుగడుగునా సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగమవుతుండటం ఆందోళనకరం. వ్యాపార కేంద్రాల్లో సబ్సిడీ గ్యాస్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. మామూళ్ల మత్తులో మునిగిన సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌కు అవేవీ కనిపించకపోవడం విడ్డూరం. కరీంనగర్‌లో దాదాపు హెచ్చు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, హాస్టళ్లు, బార్లు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు అన్నింటా ఇవే కనిపించడం అధికారుల డొల్లతనాన్ని చాటుతోంది. పత్రికల్లో కథనాలు వస్తే మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం, లోతుగా దర్యాప్తు లేకుండానే హోటళ్ల వరకే చర్యలకు పరిమితమవడం. పలు ఏజెన్సీలు నిబంధనలను విస్మరించి భారీ అక్రమ వ్యాపారానికి తెరదీశారు. పర్యవేక్షించాల్సిన శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు.
తనిఖీలేవీ..
ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుండటంతో క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాల్సిన పౌరసరఫరాల శాఖ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నగరంలో ఇండెన్, హెచ్‌పీ, భారత్ కంపెనీల వినియోగదారులుండగా 11 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీలు, గోడౌన్లలో తనిఖీలు చేపట్టాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు విధులు మరిచారన్న విమర్శలున్నాయి. అయితే సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్, డీటీ సివిల్ సప్లయ్, ఏఎస్వోలు ప్రతీనెలా తనిఖీలు నిర్వహించాలన్న టార్గెట్ ఉంటుండగా తనిఖీలు చేస్తే ఇంత బహిరంగంగా ఎలా వినియోగిస్తారన్నది అంతుచిక్కని ప్రశ్న.
రూ.కోట్లలో అక్రమ వ్యాపారం
ఆహార నాణ్యత అటుంచితే హెచ్చు ప్రాంతాల్లో కమర్షియల్ సిలిండర్లు పేరుకు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. కానీ వినియోగించేది మాత్రం సబ్సిడీ గ్యాస్. కమర్షియల్ సిలిండర్ ధర రూ.1946 ఉండగా సబ్సిడీ గ్యాస్ రూ.924కే దొరుకుతుండటం, అందుకు గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్‌ల సంపూర్ణ సహకారముండటంతో కమర్షియల్ సిలిండర్ వాడకాన్ని 80శాతం తగ్గించారు. ఒక్కో హోటల్‌లో కస్టమర్లను బట్టి కనిష్టంగా నెలకు 10 నుంచి 50సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రాయితీ గ్యాస్ వినియోగించే ఒక్కో హోటల్‌లోనే రూ.20వేల నుంచి 70వేల వరకు అక్రమంగా లాభపడుతున్నారు. రాయితీ గ్యాస్ వినియోగించే అన్ని ప్రాంతాలను లెక్కిస్తే నెలకు రూ.కోట్లలో ప్రయోజనం పొందుతున్నారు.
భారీగా తేడాలు
జిల్లాలో రెస్టారెంట్లు, హోటళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, టీస్టాల్స్, నూడిల్స్ పాయింట్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, తోపుడు బండ్లు అన్ని కలిపి 2వేల వరకు ఉంటాయని అంచనా. కానీ వారు బుక్ చేసే సిలిండర్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. విపరీతంగా కస్టమర్లు ఉన్న హోటళ్లలోనూ తక్కువ కమర్షియల్ సిలిండర్లు వాడారంటే అక్రమం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా ఉన్న సంఖ్యకు వారు వినియోగిస్తున్న కమర్షియల్ సిలిండర్‌ల మధ్య భారీ వ్యత్యాసాలున్నాయని పక్కా సమాచారం. విద్యార్థుల వద్ద లక్షల్లో ఫీజులు వసూలు చేసే పలు విద్యాసంస్థల్లో సైతం రాయితీ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను పరిగణనలోకి తీసుకుంటే నెలకు సుమారు 10వేల సిలిండర్ల వినియోగం జరగాలి. కేవలం వందల్లోనే కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో సగటున ఒక నెలకు 20వేల సిలిండర్లు పక్కదారి పడుతున్నాయని సమాచారం.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కేవలం గృహాల్లో మాత్రమే వినియోగించాలి. కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వ్యాపారులు వినియోగించాలి. తనిఖీలు చేసి చర్యలు చేపడతాం.
– నర్సింగరావు,
కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల అధికారి
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రోడ్డులో టీఎస్02యుబి4971 నంబర్ గల ఆటోలో సిలిండర్లను తరలిస్తుండగా సదరు ఆటో డ్రైవర్ డ్రెస్‌కోడ్ లేకుండా గ్యాస్ డెలివరీ చేశారు. గ్యాస్ రీపేర్ చేసే దుకాణంలో గ్యాస్ బండ వేయగా అదేంటని ‘సాక్షి’ ప్రశ్నించగా సమాధానం దాటవేశాడు. విజయభారత్ గ్యాస్ ఏజెన్సీ అని, అదొక్కటే బ్లాక్‌లో వేశానని చెప్పుకొచ్చారు.
యథేచ్ఛగా గ్యాస్ దందా
యథేచ్ఛగా గ్యాస్ దందా


