మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య
ఓదెల(పెద్దపల్లి): రాత్రివరకూ మద్యం తాగి ఇంటికి వస్తే ఊళ్లోవారు ఏమనుకుంటారని తండ్రి మందించినందుకు మనస్తాపం చెందిన బైరి నరేశ్(25) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై కిషన్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నరేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. ఇంటికి ఆలస్యంగా చేరుకున్నాడు. రాత్రివరకూ మద్యం తాగి ఇంటికి వస్తే ఊళ్లోవాళ్లు ఏమనుకుంటారని తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన నరేశ్.. ఇంట్లోని గడ్డిమందు తాగి వాంతులు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తొలుత సుల్తానాబాద్, ఆ తర్వాత కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి పెద్దకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అనారోగ్య సమస్యలతో వ్యక్తి..
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన మేళ్ల నారాయణ(64) అనారోగ్య సమస్యల కారణంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ కొంత కాలంగా కిడ్నీ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి పొలం వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఉరేసుకొని మరొకరు..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని బస్వాపూర్‌కు చెందిన సుధగోని పరశురాములు (48) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీత కార్మికుడిగా పనిచేస్తున్న పరశురాములు ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్యం పాలవడంతో మానసికంగా కృంగిపోయి బాత్‌రూంలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య మంగవ్వ, కూతురు, కొడుకు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.
అనారోగ్యంతో ఇంకొకరు..
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని భవానీనగర్‌లో నివాసం ఉంటున్న మర్రికంటి మల్లయ్య (45 బుధవారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లికి చెందిన మర్రికంటి మల్లయ్య, భార్య గంగవ్వ జగిత్యాలలోని భవానీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో పనులు చేసుకుంటూ జీవిస్తారు. మల్లయ్య కొద్దిరోజులుగా మద్యానికి బానిసవడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయి. రెండు రోజులుగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి భోజనం చేసి పడుకోగా.. వేకువజామున ఇంట్లో ఉన్న సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు.
మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య
మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య


