ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పాపయ్యపల్లె గ్రామంలో పొలంలో ప్రమాదవశాత్తు పడి వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన సలేంద్రి మల్ల య్య(65) అనే వృద్ధుడు మతిస్థిమితం సరిగా లేక భిక్షాటన చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 5న ఇంటిలో నుంచి వెళ్లిన మల్లయ్య బుధవారం ఉదయం పాపయ్యపల్లెలోని ఓ రైతు పొలంలోని బురదలో పడి మృతిచెంది కనిపించాడు. మొదట గుర్తుతెలియని మృతదేహంగా సోషల్ మీడియాలో పోలీసులు పోస్టు చేయగా సిరిసిల్లకు చెందిన వాడిగా ఆచూకీ లభించింది. దీంతో మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
ఇల్లందకుంట(హుజూరాబాద్): భోగంపాడు గ్రామానికి చెందిన వేమా రాజు(36) అనే వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్లి రావడం లేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగగా.. బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజుకు రామన్నపల్లికి చెందిన రేణుకతో పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం. రేణుక పుట్టింటికి వెళ్లి తిరిగి రావట్లేదనే బాధతో రాజు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 2న తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యం కోసం 108 వాహనంలో జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి తల్లి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.
ట్రాక్టర్ పైనుంచి పడి..
బోయినపల్లి: మండలంలోని మాన్వాడ గ్రామానికి చెందిన బత్తిని దేవయ్య (48)ట్రాక్టర్‌పై నుంచి పడి మృతిచెందినట్లు వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన దేవయ్య ఇసుక రవాణా అనుమతులతో డ్రైవర్ సాయంతో ఇసుక జారవేస్తాడు. వెంకట్రావుపల్లిలో బైక్ పెట్టి ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వేణుతో కలిసి కొదురుపాకలో ఇసుక ట్రిప్ పోసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా వెంకట్రావుపల్లి వద్ద ట్రాక్టర్ బ్రేక్ వేయడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం దేవయ్యను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.
ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి
ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి


