జనశక్తి మాజీ నక్సలైట్ల అరెస్ట్
● 9ఎంఎం పిస్టల్, ఐదు బుల్లెట్లు స్వాధీనం
● నలుగురి అరెస్ట్
● ఎస్పీ మహేశ్ బి గితే వెల్లడి
సిరిసిల్ల: సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీకి చెందిన మాజీ నక్సలైట్లను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి వారి వద్ద 9 ఎంఎం పిస్టల్, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎస్పీ మహేశ్ బీ గితే వివరాలు వెల్లడించారు. తంగళ్లపల్లి మండలం రామన్నపల్లెకు చెందిన తోకల శ్రీకాంత్, జగిత్యాల జిల్లాకు చెందిన వంజరి సురేందర్ అలియాస్ విశ్వనాథ్ అలియాస్ బాదం సూర్యప్రకాశ్‌రెడ్డి, తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన దాసరి తిరుపతి, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన పయ్యావుల గోవర్దన్ అనే నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. జనశక్తి కార్యకలాపాల పేరుతో బెదిరింపులకు గురిచేస్తూ డబ్బు వసూలు చేయడం, భూ వివాదాలలో జోక్యం చేసుకోవడం లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనాలని ప్రయత్నిస్తున్నారు. సమాచారం మేరకు తంగళ్లపల్లి గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అపి తనిఖీ చేయగా వీరివద్ద 9 ఎంఎం పిస్తోల్, 05 బుల్లెట్లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆ నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, టాస్క్‌ఫోర్స్ సీఐ నటేశ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ రవి, తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
నలుగురిలో ముగ్గురూ జనశక్తి మాజీలే
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ముగ్గురు సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీకి చెందిన ముగ్గురు మాజీ నక్సలైట్లు ఉన్నారు. వంజరి సురేందర్ అలియాస్ విశ్వనాథ్ జనశక్తి పార్టీలో చాలా కాలం పని చేశారు. గతంలో సుద్దాల మాజీ సర్పంచ్ వేణుగోపాల్‌రావు(ప్రభాకర్‌రావు) హత్య కేసులో ప్రధాన నిందితుడు. తోకల శ్రీకాంత్ సైతం గతంలో జనశక్తిలో పని చేశారు. గోవర్ధన్‌కు సైతం జనశక్తి పార్టీతో సంబంధాలు ఉన్నాయి. సారంపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దాసరి తిరుపతి కొత్తగా వారితో చేరడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
జనశక్తి మాజీ నక్సలైట్ల అరెస్ట్


