తల్లిలేని లోకంలో ఉండలేనని..
గొల్లపల్లి: ‘అమ్మ’.. పిలుపులోనే అమృతం ఉంది. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఓ ధైర్యం. కానీ ఆ అమ్మ దూరమైతే ఆ ప్రపంచం శూన్యమని భావించాడో.. లేక అమ్మ లేని బతుకు భారమని అనుకున్నాడో తెలియదు గానీ.. తల్లి జ్ఞాపకాలతో తల్లడిల్లిపోతూ ఓ యువకుడు తనువు చాలించాడు. పేగుబంధం పిలుస్తోందంటూ తల్లి చెంతకే పయనమయ్యాడు. ఈ హృదయవిదారక ఘటన గొల్లపల్లి మండలం బీబీరాజ్‌పల్లిలో అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మల్యాల గంగరాజం, అంజ వ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రాంచరణ్ సంతానం. గంగరాజం హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. అంజవ్వ కూలీ చేసుకుంటూ కుటుంబా న్ని పోషించుకుంటున్నారు. కూతులిద్దరికీ పెళ్లి చేశారు. అంజవ్వ ఏడాది క్రితం అనారో గ్యంతో మృతి చెందింది. అప్పటినుంచి రామ్‌చరణ్ కుంగిపోయాడు. ఎప్పుడూ అమ్మ అమ్మ అంటూనే ఉన్నాడు. ఏం తిన్నా అమ్మ చేతిముద్దే గుర్తొచ్చేది. కాలం గడుస్తున్నా తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తల్లి జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతుండటంతో జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. అమ్మ ఒడిలో సేద తీరాలని నిర్ణయించుకున్నాడో ఏమోగానీ రాంచరణ్ (20) బుధవారం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు.. ఇలా అర్ధాంతరంగా విగతజీవిగా మార డం ఆ తండ్రికి తీరని శోకాన్ని మిగిల్చింది. భార్యపోయిన బాధను దిగమింగుకుని కొడుకు కోసం బతుకుతున్న గంగరాజం.. ఇప్పుడు కొడుకు కూడా దూరం కావడంతో ‘నాకింకెవరు దిక్కు బిడ్డా’ అంటూ రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు.
ఏడాదిగా మాతృమూర్తి జ్ఞాపకాలతోనే..
కన్నతల్లి పిలుస్తోందంటూ తనువు చాలించిన యువకుడు
ఒక్కగానొక్క కొడుకు మరణంతో గుండెలవిసేలా రోదించిన తండ్రి
గొల్లపల్లి మండలం బీబీరాజ్‌పల్లిలో విషాదం


