ప్రచార సందడి
జోరందుకున్న పల్లె పోరు
తొలి విడత గుర్తులు కేటాయింపు
మలి విడత పరిశీలన పూర్తి
తుది విడత కొనసాగుతున్న నామినేషన్లు
ఖర్చులకు వెనకాడని అభ్యర్థులు
పట్టణాల్లో ఉండేవారికి ప్రత్యేక ఆఫర్లు
తొలి విడత ప్రచారం షురూ..
‘రామడుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబంతో సహా హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి సదరు వ్యక్తికి ఫోన్ చేశాడు. ‘తమ్మీ.. 11వ తేదీన ఎలక్షన్లు ఉన్నాయి. నేను సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా. తప్పకుండా నాకు మద్దతు ఇవ్వాలె. మీకు ఏం అవసరం ఉన్నా చూసుకుంటా. డ్యూటీ బంజేసి ఓటేసేందుకు తప్పకుండా రావాలే. దారిఖర్చులకు పంపిస్తా’ అంటూ హామీ ఇచ్చాడు.
‘మానకొండూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కరీంనగర్‌లో ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఫోన్‌చేశాడు. ‘అన్నా.. నేను సర్పంచ్‌గా పోటీ చేస్తన్నా. తప్పకుండా నాకు ఓటెయ్యాలే. వీలైతే మధ్యలో ఒక్కసారి వచ్చి నన్ను కలిసిపోతే మంచిగుంటది. ఇంటికాడ అమ్మాబాపుకు కూడా చెప్పిన’. అంటూ గుర్తు చేశాడు.
కరీంనగర్/కరీంనగర్‌టౌన్: పల్లెల్లో ఎన్నికల సందడి జోరందుకుంది. తొలి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా.. తమను ‘గుర్తుంచుకోవాలని’ పోటీదారులు ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. రెండో విడత నామినేషన్ల పరిశీలన పూర్తికాగా.. బరిలో ఉన్నవారు సమరానికి సన్నద్ధం అవుతున్నారు. మూడో విడత నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా.. నేడు ఆఖరు రోజు కావడంతో జోరుగా దాఖలు కానున్నాయి. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 316 గ్రామ పంచాయతీలు, 2,946 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఈనెల 11న, రెండోవిడత 14న, మూడోవిడత 17 పోలింగ్ జరగనుంది.
ఖర్చు పెట్టే వారికే పెద్దపీట
జనరల్, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రత అధికంగా ఉంది. ఎంత ఖర్చయినా కొందరు వెనకాడడం లేదు. అభ్యర్థులు ప్రతి రోజు వేలల్లో ఖర్చుచేస్తున్నట్లు తెలుస్తోంది. విందు సమావేశాలు పెడుతూ తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. జనరల్ పంచాయతీల్లో రూ.20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చు పెట్టే వారికి అవకాశం కల్పిస్తున్నారు. వస్తే సర్పంచ్ పదవి, పోతే పైసలు అన్నట్లు ఖర్చుకు వెనకాడడం లేదు. ప్రజలు కూడా ఖర్చు పెట్టే వారికే పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఖర్చులకు తండ్లాట
పల్లెల్లో విందు రాజకీయాలు, తాయిలాల ప్రచారం జోరందుకోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థుకు పైసల రంది పట్టుకుంది. ఒకరిని చూసి ఒకరు అన్నట్లు అప్పులు చేసి మరీ అడ్డగోలు ఖర్చుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ రహిత ఎన్నికలు జరుగుతున్నా ఆయా పార్టీల నేతలు రంగంలోకి దిగి అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. గెలుపుకోసం ఎంత ఖర్చయినా పెట్టేందుకు అభ్యర్థులు ఆస్తులను అమ్మడానికి, తనఖా పెట్టడానికి వెనుకాడడం లేదు.
పట్టణ ఓటర్లపై దృష్టి
గ్రామాలను విడిచి పట్టణాల్లో ఉండే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేసి, వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటేసేందుకు రావాలని, రవాణా చార్జీలు, అవసరమైతే వాహనాలు పెట్టి రప్పించేందుకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తున్నారు. వారికి ఫోన్‌పే, గూగుల్‌పేలో దారిఖర్చులు పంపుతున్నారు. పట్టణాల్లో ఉండే వారు వచ్చి ఓట్లు వేసి వెళ్లే వరకు అన్ని వ్యవహారాలు చూసుకునేందుకు అనుచరులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఒక్క ఓటే ఫలితాన్ని తారుమారు చేసే పరిస్థితి ఉండడంతో ప్రతి ఓటరుపై దృష్టిపెడుతున్నారు. ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధమవుతున్నారు.
తొలి విడతలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో నామినేషన్లు పూర్తయి, సర్పంచ్, వార్డుసభ్యులకు గుర్తులు కేటాయించారు. ఆయా పంచాయతీల్లో ప్రచారం ఊపందుకుంది. రెండో విడత ఎన్నికలు జరిగే చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో నామినేషన్లు, స్క్రూటినీ పూర్తయింది. తుది విడత ఎన్నికలు జరిగే ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వీణవంక, సైదాపూర్ మండలాల్లో నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. మూడు విడతల్లో ఎన్నికలు జరిగే జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకర్షించేందుకు విందు రాజకీయాలు రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. అభ్యర్థుల ఇళ్లలో హడావుడితో పాటు ఊరంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది. కాలనీలకు, సంఘాలకు నజరానాలు ప్రకటిస్తున్నారు. సొంతఖర్చుతో ఆలయాల అభివృద్ధి, బోరుబావులు తవ్వించడం, కుల సంఘాల భవనాలకు హామీ ఇవ్వడం, యువత క్రికెట్ కిట్లు అందిస్తామని చెబుతున్నారు.
ప్రచార సందడి


