వలస పిల్లలకు వెలుగుదారి
● కలెక్టర్ పమేలా సత్పతి
గంగాధర: వలస కార్మికుల పిల్లల చదువును ప్రోత్సహించి సమీప పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామంలో గురువారం వలసకార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా తరగతులు ప్రారంభించారు. 42మందిని పాఠశాలలో చేర్పించారు. వారికి యూనిఫాం, పుస్తకాలు, నోటు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని అదేశించారు. తహసీల్దార్ రజిత, ఎంఈవో ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
చైన్‌మెన్ల ఆగడాలకు చెక్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో చైన్‌మెన్ల ఆగడాలకు బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ చెక్ పెట్టారు. ఎనిమిది మందిని గంపగుత్తగా బదిలీ చేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో క్షేత్రస్థాయిలో సహాయకులుగా ఉండాల్సిన చైన్‌మె న్లు అక్రమ వసూళ్లకు, వివాదాలకు చిరునామాగా మారడంతో వారి స్థానంలో ఔట్‌సోర్సింగ్‌కు బదులు మొత్తం రెగ్యులర్ ఉద్యోగులను నియమించారు.
గంపగుత్త బదిలీ
నగరపాలకసంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో ఎనిమిది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చైన్‌మెన్లుగా పనిచేస్తున్నారు. ముగ్గురు టీపీఎస్‌లు, ఐదుగురు టీపీబీవోలకు సహాయకులుగా ఉన్నారు. అక్రమ నిర్మాణాలు, ఫిర్యాదులు, వివాదాలు వస్తే క్షేత్రస్థాయిలో కొలతలు, ఇతరత్రా అవసరాలకు సహకరించడం వీరి విధి. తమ విధులకు మించి అక్రమ వసూళ్లు, బెదిరింపులతో చైన్‌మెన్‌లంటేనే భవన నిర్మాణదారులు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఏదైనా ఫిర్యాదు వస్తే అక్కడికి వెళ్లి అవతలి వాళ్లతో మాట్లాడుకొని డబ్బులు తీసుకొని ఫిర్యాదుదారుడిదే తప్పు అని తేల్చిచెప్పి రావడం చైన్‌మెన్‌ల ప్రత్యేకత. ఇలాంటి చైన్‌మెన్లకు కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతుండడంతో, వారి ఆగడాలు నిరాటకంగా కొనసాగాయి. దీనిపై ‘సాక్షి’లోనూ పలు కథనాలు వచ్చాయి. చైన్‌మెన్‌ల ఆగడాలపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. చైన్‌మెన్ల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించిన నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ గంపగుత్తగా మొత్తం ఎనిమిది మందిని బదిలీ చేశారు. వారిస్థానంలో రెగ్యులర్ ఉద్యోగులైన విజయ్, శ్నేషేష్ రాజ్, అన్వేష్, రామచంద్రం, అరుణ్, మల్లేశం, ఆనంద్‌కుమార్, జీత్‌కుమార్‌ను నియమించారు. రెగ్యులర్‌ఉద్యోగులైతే జవాబుదారితనం ఉంటుందనే ఉద్దేశంతో భర్తీ చేశారు. చైన్‌మెన్‌లలో ఇద్దరిని రెవెన్యూ, ఒకరు టౌన్‌ప్లానింగ్, ఐదుగురిని శానిటేషన్‌కు కేటాయించారు.


