ఎన్నికల గిరాకీ
బిజీబిజీగా ప్రింటింగ్ ప్రెస్‌లు
డమ్మీ గుర్తులకు పెరిగిన డిమాండ్
నమూనా బ్యాలెట్ పేపర్లు ముద్రించుకుంటున్న అభ్యర్థులు
డోర్ పోస్టర్లు, కండువాలు, టోపీలకు పెరిగిన క్రేజ్
కరీంనగర్‌టౌన్: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండంతో ప్రింటింగ్, ఫ్లెక్సీ దుకాణాల్లో సందడి మొదలైంది. ఎక్కడ చూసినా అభ్యర్థుల నమూనా బ్యా లెట్లు ముద్రిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కేవలం బ్యాలెట్ గుర్తు మాత్రమే ఉంటుండగా.. అభ్యర్థి పేరు ఫొటోలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో పల్లె పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు తమ గుర్తులను ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు.
పెరిగిన గిరాకీ..
స్థానిక ఎన్నికలతో ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీ దుకాణా లకు గిరాకీ పెరిగింది. అభ్యర్థులు నమూనా బ్యాలెట్, డోర్‌పోస్టర్లను ముద్రించుకుంటున్నారు. జిల్లాలో 316 గ్రామపంచాయతీలు, 2,946 వార్డు స్థానాలకు ఈనెల 11, 14, 17 తేదీలో ఎన్నికలు జరగనున్నాయి. బరిలో ఉన్నవారు తమతమ గుర్తులను ప్రచారం చేసుకునేందుకు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, మండల హెడ్ క్వార్టర్లలోఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లు, ఫెక్సీషాపులకు డిమాండ్ పెరిగింది. కరీంనగర్‌లో కలర్ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ ఉండడంతో ఎక్కువ మంది వస్తున్నారు. 100 నమూనా బ్యాలెట్‌పేపర్లకు రూ.450 చార్జి వేస్తుండగా, 100 డోర్‌పోస్టర్లకు రూ.800 నుంచి రూ 1000 తీసుకుంటున్నారు. ఎన్నికల గుర్తు కలిగిన ఒక్కో కండువాను రూ.25, టోపీ రూ.30కి విక్రయిస్తున్నారు. డమ్మీ గుర్తులు బ్యాడ్జీలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రింటింగ్ ప్రెస్‌లకు డిమాండ్ పెరిగింది. ఒక్కో గ్రామంలో 5 నుంచి 10కి పైగానే వార్డుస్థానాలు ఉండగా ఒక్కోవార్డు స్థానానికి ముగ్గురు, నలుగురు బరిలో ఉన్నారు. వారంతా ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం నమూనా బ్యాలెట్లు, డోర్ పోస్టర్లను ముద్రించుకుంటున్నారు.


