ధర్మపురిలో దొంగతనం
ధర్మపురి: ధర్మపురిలోని బోయవాడలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.80వేలు, ఏడున్నర తులాల బంగారం, 30 తులాల వెండి అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు గడప రమేశ్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన గడప రమేశ్, లక్ష్మి దంపతులతోపాటు రమేశ్ తల్లి ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో బీరువాపై ఓ పాత డబ్బాలో రూ.80 వేలు, ఏడున్నర తులాల బంగారం, 30 తులాల వెండిని దాచిపెట్టారు. అనంతరం గదికి తాళం వేశారు. ఈనెల 2న తన తండ్రి సంవత్సరీకం కోసం పాత ఇంటికి వెళ్లారు. మంగళవారం కొన్ని డబ్బులు అవసరం ఉండడంతో డబ్బాలో దాచిన డబ్బును తీసుకుందామని చూడగా అందులో బంగారం, నగదు, వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించుకుపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై ఉదయ్‌కుమార్ తన సిబ్బందితో చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. డబ్బాలో ‘అరేయ్ నిన్ను ఎప్పటికై నా వదిలిపెట్టను..’ అనే చీటీ కనిపించగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● రూ.80వేలు.. ఏడున్నర తులాల బంగారం, వెండి అపహరణ
● సంఘటనా స్థలానికి క్లూస్‌టీం


