అత్యాశల దందా
ఆన్‌లైన్.. బిట్‌కాయిన్.. క్యాసినో
● పెట్టుబడులను లాగేస్తున్న మాఫియా ● జిల్లా వ్యాప్తంగా తగ్గిన ‘రియల్’ బిజినెస్ ● కుదేలవుతున్న ‘భూ’ వ్యాపారం
కరీంనగర్‌క్రైం:
రోజురోజుకు బిట్‌కాయిన్, క్యాసినో సామ్రాజ్యం విస్తరిస్తోంది. మార్కెట్‌లో ఉన్న డబ్బంతా వీటి వైపే మళ్లుతోంది. విదేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని చేస్తున్న బిట్‌కాయిన్ దందా జిల్లాలోని పెట్టుబడులను లాగేస్తోంది. కొంతమంది అత్యాశతో బిట్‌కాయిన్ వైపు వెళ్తుండగా.. మరికొందరు గోవాతో పాటు సముద్రతీర ప్రాంతాల్లో జరిగే క్యాసినోలో పెట్టబుడులు పెట్టి ఆదాయం సంపాదించాలని చూస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రియల్ భూం తగ్గడానికి ఈ దందాలే ప్రధాన కారణమని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
ఇతర దందాల్లో పెట్టుబడులు
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా మంది డబ్బు ఉన్నవారితో పాటు మధ్యతరగతి వర్గాల వారు గతంలో భూములపై పెట్టుబడులు పెట్టి లాభం వచ్చాక అమ్మకాలు జరిపించేవారు. కొంత మంది భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడులు పెట్టగా మరికొందరు వ్యాపార ధోరణితో స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేవారు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చాక ఒక్కసారిగా స్థిరాస్తుల వ్యాపారం గణనీయంగా తగ్గిపోయింది. ఆ సమయంలో ఎన్నికలు ఉండడంతో డబ్బు ఒకచోట నుంచి మరో చోటికి చేర్చడం కష్టంగా మారడంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోవడంతో బిట్‌కాయిన్, క్యాసినో వంటి దందాలు చాలా మందిని ఆకర్షించాయి. వీటి వైపునకు మళ్లిన జనం వ్యాపారంతో పాటు విలాసవంతమైన లైఫ్ స్టైల్‌కు అలవాటుపడి ఇలాంటి దందాల్లో వారితో పాటు, తెలిసినవారు, తోటి ఉద్యోగులు, బంధువులు ఇలా అందరితో పెట్టుబడులు పెట్టించి ఇతర రాష్ట్రాలు, విదేశీయాత్రలు ఆఫర్‌లు చేస్తుండడంతో విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఇలాంటి దందాలు చేస్తూ పలువురు మోసపోగా, ముందుగా చేరిన వారు కొందరు మాత్రం బాగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ, పోలీసు డిపార్ట్‌మెంట్‌లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, రాజకీయ నాయకులు సైతం ఇటు వైపుగానే పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.150 కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు తరలిపోతున్నట్లు అంచనా.
కుదేలైన రియల్ వ్యాపారం
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుతూ వస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పుంజుకుంటుందని ఎదురుచూపులు చూసినా ఎంతకీ ఆశాజనకంగా లేకపోయేసరికి ఎన్నికలకు ముందు పెట్టుబడులు పెట్టిన వారు లబోదిబోమంటున్నారు. ఇప్పటికీ చాలా తక్కువగా వ్యవసాయభూములు, ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకు వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇతర రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారుగా రూ.100 నుంచి రూ.120 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. కానీ ఇప్పుడు అన్నీ కలిపి రూ.40 కోట్ల లోపే ఆదాయం వస్తుండడంతో వ్యాపారం ఎంత పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఆన్‌లైన్ మోసపూరితమైన దందాల్లో పెట్టుబడులు పెడితే ఎప్పటికై నా నష్టం తప్పదని పోలీసులు సూచిస్తున్నారు.
తెలిసే పెట్టుబడి పెడుతుంటారు
బిట్‌కాయిన్ వంటి ఆన్‌లైన్ దందాల్లో చాలా మంది తెలిసే పెట్టుబడి పెడుతున్నారు. మోసం జరిగిన తర్వాత పోలీసుల వద్దకు వస్తున్నారు. బిట్‌కాయిన్ వంటి వాటిలో మోసాలు జరిగితే సైబర్‌పోలీసు విభాగంతో విచారణ చేపడుతున్నాం. మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రజలకు అనధికారిక యాప్‌లు, లోన్‌యాప్‌లు, సైబర్, క్రిప్టో కరెన్సీ మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం.
– గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్
రియల్ వ్యాపారం తగ్గింది
ఏడాదిన్నర కాలంగా రియల్ ఎస్టేట్‌పూర్తిగా పడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రభావంతో తగ్గాయని అనుకున్నాం. కానీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినా.. పెరగడం లేదు. చాలా మంది బిట్ కాయిన్ వంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు చర్చ జరుగుతోంది. – వి.వెంకన్న,
రియల్ ఎస్టేట్ వ్యాపారి, కరీంనగర్
ఉమ్మడి జిల్లా సమాచారం
2023 కన్నా ముందు స్థిరాస్తుల
రిజిస్ట్రేషన్ల ద్వారా ఒక నెలకు వచ్చిన ఆదాయం: రూ.120 కోట్లు
ప్రస్తతం ఒక నెలకు వస్తున్న ఆదాయం: రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు
బిట్ కాయిన్, క్యాసినో వంటి
దందాలకు తరలిపోతున్న
పెట్టుబడులు నెలకు సుమారు
రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు
అత్యాశల దందా
అత్యాశల దందా


