కేటీఆర్‌పైనే అనిల్‌ కుటుంబం ఆశలు..!

- - Sakshi

బోయినపల్లి(చొప్పదండి): జమ్మూకాశ్మీర్‌లో జరిగిన హెలీకాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన మల్కాపూర్‌కు చెందిన ఆర్మీ జవాన్‌ అనిల్‌ కుటుంబం ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తోంది. అనిల్‌ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌.. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈనెల 5న భరోసా ఇచ్చారు. వారం రోజులు కావస్తున్నా ఇప్పటివరకే అటు కేంద్రంనుంచిగానీ.. ఇటు రాష్ట్రంగానీ సహాయానికి సంబంధించిన ప్రకటన రాలేదు. ఈ క్రమంలోమంత్రి కేటీఆర్‌ ప్రకటనపైనే అందరి దృష్టి ఉంది.

11 ఏళ్లు సైన్యంలో..
మల్కాపూర్‌కు చెందిన పబ్బాల లక్ష్మి, మల్లయ్య కుమారుడు అనిల్‌ డిగ్రీ వరకు చదుకుని 11 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరారు. అనిల్‌కు ఏడేళ్ల కిత్రం మండలంలోని కోరెం గ్రామానికి చెందిన సౌజన్యతో వివా హమైంది. వీరికి ఇద్దరు కుమారులు అయాన్‌ (6), అరయ్‌(3) సంతానం. అనిల్‌ సోదరులు శ్రీనివాస్‌, మహేందర్‌ వ్యవసాయం చేసుకుని జీవిస్తారు. తండ్రి మలయ్య అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. 45రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన అనిల్‌ తండ్రి కాలుకు సర్జరీ చేయించాడు. ఇలాంటి తరుణంలో అనిల్‌ మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీరని వేదనలోకి నెట్టింది. అనిల్‌ కుమారులు చిన్నపిల్లలు కావడం.. తండ్రి మంచానికే పరిమితమవడం.. భర్త చనిపోయిన విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేక నిత్యం రోదిస్తున్న ఆయన భార్య సౌజన్యను చూసినవారికే కన్నీళ్లు ఆగడం లేదు.

మంత్రిపైనే ఆశలు..
అనిల్‌ కుటుంబాన్ని ఆదుకోవడం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తోనే సాధ్యమవుతుందని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ప్రకటన చేయడం.. మంత్రి గంగుల కమలాకర్‌ సైతం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే ఇక్కడికి వచ్చానని చెప్పడం ఆ కుటుంబానికి చిరుదీపంలో కనిపిస్తోంది. అనిల్‌ భార్య సౌజన్య డిగ్రీ చదువుకుంది. భర్త ప్రోత్సాహంతో ఇటీవల ఎస్సై రాత పరీక్ష కూడా రాసింది. మంత్రి కేటీఆర్‌ చొరవ తీసుకుని సౌజన్యకు ఉద్యోగం ఇప్పించాలని, సైనికుడికి అందించే అన్నిరకాల సహాయం అందించాలని గ్రామస్తులు అంటున్నారు. అనిల్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నప్పటి నుంచి ఇద్దరు ఆర్మీ జవాన్లు ఇక్కడే ఉండి డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నారని, సౌజన్య బ్యాంకు అకౌంట్‌, తదితర ధ్రువీకరణపత్రాలు సేకరిస్తున్నారని తెలిసింది. అలాగే కుటుంబంలో ఏమైనా గొడవలుంటే సరి చేయాలని ఆర్మీ ఉన్నతాధికారులు, ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top