పల్లెలకు నిధుల వరద
గ్రామాలకు సీఎం ప్రత్యేక నిధులు
పెద్ద పంచాయతీలకు రూ.10లక్షలు
చిన్న పంచాయతీలకు రూ.5లక్షలు
15వ ఆర్థిక సంఘం నిధులకు కేంద్రం ఆమోదం
హర్షం వ్యక్తం చేస్తున్న పాలకవర్గాలు
కరీంనగర్‌టౌన్: గ్రామ పంచాయతీలకు మంచి రోజులొచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2025–26 ఏడాదికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. రెండు నెలల్లోనే నిధులు వినియోగించేలా పంచాయితీరాజ్ మార్గదర్శకాలు వెలువరించడంతో నూతన పాలకవర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో సర్పంచుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సీఎం ప్రత్యేక నిధులు, 15వ ఆర్ధిక సంఘం నిధులతో పాలక వర్గాలకు ఊరట లభించింది. జిల్లావ్యాప్తంగా 316 పంచాయతీలుండగా రూ.26 కోట్ల వరకు సీఎం ప్రత్యేక నిధులు అందవచ్చునని అంచనా వేస్తున్నారు. పెద్ద పంచాయతీలకు రూ.15 కోట్లు, చిన్నవాటికి రూ.11 కోట్లు అందుతాయని భావిస్తున్నారు.
కేంద్రం నిధులు
2011 జనాభాకు అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతాయి. గ్రామ పంచాయతీల్లో ఒకవ్యక్తికి ఏడాదికి రూ.618 చొపున కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. వీటికి తోడు సీఎం ప్రత్యేక నిధుల వస్తే పల్లెల్లో అభివృద్ధి పట్టాలు ఎక్కనుంది. వీటితో పాటు పంచాయతీలు విధించే పన్నులు, రుసుముల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఇంటిపన్ను, నీటిపన్ను, వృత్తి పన్ను, వారాంతపు సంతలు, మార్కెట్ల నిర్వహణ, పంచాయతీకి భవనాలు, ఖాళీ స్థలాలు, ఆస్తులు అద్దెకు ఇవ్వడం ద్వారా పంచాయతీలకి సొంత వనరులు సమకూరుతాయి. రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్‌డ్యూటీ వాటా చెల్లిస్తుంది. ఈ విధుల నుంచి ఉద్యోగుల జీతభత్యాలకు 30శాతం, పారిశుధ్యం, వీధి దీపాలకు, మంచినీరు తదితర వాటికి 15శాతం చొప్పున, రహదారులు, కాలువకు 20శాతం, ఇతర అవసరాలకు 10శాతం చొప్పన ఈ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఈ నిధులు ఏ మేరకు అందుతాయేలేదో వేచి చూడాలి.


