వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలి

Jul 10 2026 7:58 AM | Updated on Jul 10 2026 7:58 AM

వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలి

భూముల రీసర్వేను

పకడ్బందీగా నిర్వహించాలి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి క్రైం: ఎల్‌నినో కారణంగా వర్షాలు సకాలంలో కురవని నేపథ్యంలో రైతులు వరి సాగును తగ్గించుకోవడం మంచిదని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎల్‌నినో ప్రభావం, ఆరుతడి పంటల ప్రాముఖ్యతలపై పలు సూచనలు జారీ చేశారు. వీసీ అనంతరం కలెక్టర్‌ సంగ్వాన్‌ జిల్లా అధికారులతో సమావేశమై ఆయా అంశాలపై సూచనలు ఇచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. నీటి ఆవశ్యకత అధికంగా ఉండే వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించాలన్నారు. వరి స్థానంలో మొక్కజొన్న, సోయా, పెసర, మినుము, అలసందలు, కంది, పత్తి, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రధాన రిజర్వాయర్లు అయిన నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌ నాలాలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున వరి సాగును తగ్గించాలన్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలను ఎంచుకోవాలని సూచించారు. రైతు వేదికల్లో వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశాలు నిర్వహించి, రైతులకు ఆరుతడి పంటల ప్రాముఖ్యత, సాగు పద్ధతులు, ప్రభుత్వ సహకారం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ విక్టర్‌, డీఏవో మోహన్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

రీసర్వేను వేగవంతం చేయాలి

భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. భూముల రీసర్వే, నక్ష భూముల అంశాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. వీసీ అనంతరం కలెక్టర్‌ సంగ్వాన్‌ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయా పనులపై దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రీసర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. రీసర్వే పనుల పురోగతిపై రోజువారీ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లతో సమావేశం నిర్వహించి సర్వే పనుల్లో వారి పాత్ర, బాధ్యతలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ విక్టర్‌కు సూచించారు. సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement