నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్ర శాసనసభ, శాసనమండలి మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నియామకం అయ్యారు. 2026–27 సంవత్సరానికి ఉభయసభల కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ గురువారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్ గా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సీఎం రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
బాన్సువాడ : బాన్సువాడ ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహం వార్డెన్ మమతను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి వెంకటేశ్ తెలిపారు. ఈ నెల 8న వసతిగృహంలో ఇంటర్ విద్యార్థిని అమృత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.50 వేల అందజేశామని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు, ఇందిరమ్మ ఇల్లు మంజురు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు.
బాన్సువాడ : బాన్సువాడ ఇన్‌చార్జి ఎంపీవో నాగరాజును కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు ఎంపీడీవో ఆనంద్ తెలిపారు. గతంలో పిట్లం ఎంపీవోగా నాగరాజు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిలో వెనుకబడి ఉండటంతో కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి క్రైం: సాధారణ తనిఖీల్లో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం సందర్శించారు. గోదాంలోని రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ఎన్నికల విభాగం డీటీ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.


