సన్న బియ్యం.. మరింత ప్రియం | - | Sakshi
Sakshi News home page

సన్న బియ్యం.. మరింత ప్రియం

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

సన్న బియ్యం.. మరింత ప్రియం

ఎల్లారెడ్డి మార్కెట్‌లో సన్నబియ్యం ధరల వివరాలు.. (రూ.లలో)

స్టాక్‌ లేదంటున్నారు..

భారీగా పెరిగిన ధర

ఆందోళన చెందుతున్న

మధ్యతరగతి ప్రజలు

ఎల్లారెడ్డిరూరల్‌: సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పది రోజుల్లోనే క్వింటాలుకు గరిష్టంగా వెయ్యి రూపాయల వరకు ధర పెరిగింది. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సన్నరకం వరిధాన్యాన్ని ఎక్కువగా బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, చందూర్‌, వర్ని, మోస్రా, కోటగిరి, పోతంగల్‌, రుద్రూర్‌ మండలాలలో పండిస్తారు. ఇక్కడ సాగు చేసిన సన్నరకం వడ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, ఆంధ్రపదేశ్‌లోని విజయవాడ, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ప్రాంతాల వ్యాపారులు పంట కోసిన వెంటనే కొనుగోలు చేసి తీసుకువెళ్లారు. ఇక్కడ సాగైన సన్న వడ్లు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లిపోవడంతోపాటు బోనస్‌పై ఆశతో చాలా మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. దీంతో స్థానికంగా సన్న వడ్లకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో రవాణా భారం పెరిగి ధరలకు రెక్కలొస్తున్నాయి. ఆయా రకాల బియ్యం ధరలు పది రోజుల వ్యవధిలోనే క్వింటాలుకు రూ. 8 వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పెరగడం గమనార్హం.

సన్నబియ్యం రకం పాత ధర ప్రస్తుత ధర

బీపీటీ 3,800 4,800

హెచ్‌ఎంటీ 5,200 6,000

ఆర్‌ఎన్‌ఆర్‌ 4,600 5,500

జేఎస్‌ఆర్‌ 6,800 7,600

గతంలో జైశ్రీరాం రకం బియ్యం క్వింటాలు ధర రూ. 6,800 ఉండేది. ఇప్పుడు అడిగితే రూ. 7,600లు చెబుతున్నారు. క్వింటాలుకు రూ. 800 ధర పెరిగింది. ధర పెరిగినా స్టాక్‌ లేదంటున్నారు. బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– సంతోష్‌, ఎల్లారెడ్డివాసి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement