తాడ్వాయి(ఎల్లారెడ్డి): కన్‌కల్ ప్రభుత్వ పాఠశాల గొప్ప చరిత్ర సృష్టించిందని డీఈవో మల్లికార్జున్ అన్నారు. ఆయన బుధవారం పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డితో కలసి కన్‌కల్ గ్రామంలో గల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఏకంగా రెండు పాఠశాలలో 145 మంది విద్యార్థులు ఒకేసారి చేరడం కొత్తచరిత్ర సృష్టించినట్లయిందన్నారు. సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ కలసి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లలను ప్రవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం చాలా సంతోషకరమన్నారు. అనంతరం పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కన్‌కల్ గ్రామవాసి పులుగం దామోదర్‌రెడ్డి..పాఠశాలలో ఎలాంటి వసతులు ఉన్నాయని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే తనవంతు సహాయ, సహకారాలను అందిస్తానన్నారు. ఎంఈవో రామస్వామి, సర్పంచ్ రవీందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, హెచ్‌ఎంలు సంగారెడ్డి, ఆశాజ్యోతి, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.


