తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో బ్యాక్‌లాగ్‌పరీక్షలు జులై 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ కే సంపత్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2016, 2017, 2018, 2019, 2020 బ్యాచ్‌ల డిగ్రీ విద్యార్థులకు చివరి అవకాశంగా ఇస్తున్న బ్యాక్‌లాగ్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్ www. telanganauniversity. ac. in లో పొందుపర్చినట్లు తెలిపారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ, బీపెడ్ నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్ www. telanganauniversity. ac. in ను సంప్రదించాలని ఆయన సూచించారు.
మినీ స్టేడియం
ఏర్పాటు చేయండి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు దత్తు, గోపాల్‌పేట ఉపసర్పంచ్ గులాం వినతిపత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం వారు ఆయనను కలిశారు. మండలంలో మినీస్టేడియం లేకపోవడం వల్ల క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు వివరించారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. నాయకులు కుమార్, మధు ఉన్నారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని మహ్మదీయకాలనీకి చెందిన బాలుడు షోయబ్(16) అదృశ్యమైనట్లు రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై యాదగిరిగౌడ్ బుధవారం తెలిపారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన షోయబ్ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): భారతీయ జన తా పార్టీ సీనియర్ నాయకుడు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహారాజుల మురళి(59) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మురళి క్రియాశీల రాజకీయాల్లో గత 30 ఏళ్లుగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా, కరసేవకుడిగా పనిచేశారు. మురళి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా, రాష్ట్ర నాయకులు, అలాగే ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అతడి స్నేహితులు, బంధువులు గ్రామానికి చేరుకొని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.
వేల్పూర్: మండలంలోని మోతె గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ఎత్తుకెళ్లినట్లు రైతులు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేయడంతో పొలాలకు నీటి సరఫరా నిలిచిపోయిందని, వరి నారుమడులు తడి ఆరిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు త్వరగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఖిల్లా చౌరస్తాలో ఉన్న బాల్యరక్ష భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి పలు ఫైళ్లను తగలబెట్టినట్లు ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై సునీల్ తెలిపారు. బుధవారం రాత్రి బాల్యరక్ష భవనంలోకి చొరబడిన దుండగులు బీరువాలోని ఫైళ్లను తగులబెట్టారని చైల్డ్ హెల్త్‌లైన్ సూపర్‌వైజర్ కేతావత్ భీక్‌సింగ్ ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు.


