బాన్సువాడ రూరల్: హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని జిల్లా ఆహార భద్రత అధికారి విక్రమ్ సూచించారు. బుధవారం ఆయన బాన్సువాడ పట్టణంలోని పలు హోటళ్ళు, రెస్టారెంట్లు, రిటైల్ ఆహార దుకాణాలను తనిఖీ చేశారు. వండిన ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లలో అప్రరిశుభ్రంగా నిల్వచేయడం, ఆహార పదార్థాలకు కృత్రిమ రంగులు వినియోగిస్తుండం గమనించి నిర్వాహకులను హెచ్చరించారు. హోటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనుమానిత ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. ప్రయోగశాల నివేదిక వచ్చిన తర్వాత ఆహార భద్రత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పేట్‌సంగెం సంఘమేశ్వరాలయంలో బుధవారం వర్షాలు కురవాలని గ్రామస్తులు వరుణ యాగం నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై సుమారు 20 రోజులు గడుస్తున్నా వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కార్యక్రమంలో పేట్‌సంగెం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


