కామారెడ్డి టౌన్ : విద్యార్థులు అన్నిరంగాల్లో ప్రావీణ్యత సాధించి బహుముఖ ప్రజ్ఞాశాలులుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఆకాంక్షించారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని యోగా భవన్‌లో నిర్వహించిన కళ, సాంస్కృతిక ఉత్సవాల ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. జిల్లాలో తొలిసారి నిర్వహించిన కళా ప్రదర్శనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఆర్ట్ ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొని అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సమన్వయకర్తలు వేణుగోపాల్, నాగవేందర్, వెంకటరమణరావు, సుకన్య, కృష్ణ చైతన్య, ఎంఈవో ఎల్లయ్య, ఎఫ్‌ఏవో రమేష్, న్యాయ నిర్ణేతలు సంగీత, నీరజ, భవాని తదితరులు పాల్గొన్నారు.


