కామారెడ్డి టౌన్ : ప్రతి మహిళ శారీరకంగా, మానసికంగా శక్తిమంతమవ్వాలని రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత కార్యవాహిక శ్రీపాద రాధ, కామారెడ్డి సాంఘిక సంక్షేమ పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ వనిత పేర్కొన్నారు. తనను తాను రక్షించుకుంటూనే సమాజ రక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాల ఆవరణలో 15 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర సేవి కా సమితి శిక్షా వర్గ సార్వజనికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో వారు మాట్లాడు తూ భౌతిక హిందుత్వాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకు సమితి నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహిళలు ఎటువంటి సమస్యలకూ బెదరకూడదని, వైఫల్యాలకు కృంగిపోకుండా, ప్రశంసలకు పొంగిపోకుండా స్థిరంగా సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో మాతృశక్తిని జాగృతం చేయాలన్నారు. ఈ సందర్భంగా 15 రోజులుగా శిక్షణ పొందిన సేవికలు ప్రదర్శించిన శారీరక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సమితి ప్రాంత కార్యవాహిక భాస్కరలక్ష్మి, ప్రాంత సంపర్క ప్రముఖ్ సింధు తదితరులు పాల్గొన్నారు.


